ICC World Cup 2023: ప్రపంచ కప్‌లో ఘోర వైఫల్యం.. ఆ జట్లపై భారీ ప్రభావం!
వన్డే వరల్డ్ కప్ 2023లో హాట్ ఫేవరేట్‌లుగా బరిలోకి దిగిన కొన్ని జట్లు దారుణ ప్రదర్శనను మూటకట్టుకున్నాయి. పసికూనల చేతిలో ఓడిపోయి ఘోర వైఫల్యాలను చవిచూశాయి. ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డును ఆ దేశం రద్దు చేయగా, ఐసీసీ కూడా శ్రీలంకపై నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంది. ఒకవేళ కప్పు గెలవకపోయినా ప్రదర్శన బాగుంటే అభిమానులు వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. కానీ పేలవ ప్రదర్శన చేస్తే మాత్రం అభిమానుల నుంచి తీవ్ర ఆగ్రహం ఎదుర్కోక తప్పదు. 2007లో భారత జట్టు చెత్త ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ జట్టులో భారీ మర్పులు
ఈ ప్రభావంతో టోర్నీ అవ్వగానే ద్రవిడ్ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. తర్వాత జరిగిన టీ20 ప్రపంచ కప్ నుంచి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ లాంటి సీనియర్లు తప్పుకున్నారు. అదే టోర్నీలో పాకిస్థాన్ గ్రూప్ లోనే నిష్క్రమించింది. దీంతో ఆ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక 2015లో ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించగా, ఇంగ్లండ్ బోర్డు జట్టు మొత్తాన్ని మార్చేసింది.
బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్ రాజీనామా
ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీలంక, వన్డే వరల్డ్ కప్‌లో ఆడిన 9 మ్యాచులు ఆడి ఏడు పరాజయాలను మూటకట్టుకుంది. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డును శ్రీలంక ప్రభుత్వం రద్దు చేసింది. ఈ టోర్నీలో చెత్త ప్రదర్శన చేసిన బంగ్లాదేశ్ జట్టులో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఆ జట్టు బౌలింగ్ కోచ్ అలెన్ డొనాల్డ్ తన పదవికి రాజీనామా చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. ఇక బట్లర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేయడం లాంఛనమే.