Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం కష్టమే.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌పై క్రికెట్ అభిమానుల నిరీక్షణ కొనసాగుతోంది.అయితే ఐసీసీ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. ఇవాళ నిర్ణయం తీసుకుంటారని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఈ ట్రోఫీ నిర్వహణపై అనుమానాలను వ్యక్తం చేశాడు. ట్రోఫీ పాకిస్థాన్ ఆతిథ్యంలో జరగాల్సి ఉన్నప్పటికీ, బీసీసీఐ, పీసీబీ మధ్య సయోధ్య కుదరడం లేదు. ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించమంటూ పీసీబీకి ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. లతీఫ్ అభిప్రాయం ప్రకారం, ఈ ట్రోఫీ జరగకపోవడమే మంచిదని, ఐసీసీ కంటే ముందుగా తిరస్కరించాల్సిందిగా పీసీబీకి సూచించాడు.
నేడు తుది నిర్ణయం వచ్చేనా?
భారత్ బాయ్‌కాట్ భయంతో ఏ సంస్థా బీసీసీఐతో పోరాడలేదని, ఈ పరిస్థితిలో పాకిస్థాన్ తన పద్ధతులపై స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నాడు. ఈ రోజు జరగనున్న సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం వెలువడే అవకాశముంది. పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించే సూచనలు కనిపిస్తున్నా, భవిష్యత్తులో భారత్ ఆతిథ్యంలోని మ్యాచ్‌లకు ఇదే మోడల్‌ను అమలు చేయాలని పీసీబీ విజ్ఞప్తి చేసింది. ఐసీసీ ఈ విషయంలో పీసీబీకి లిఖిత పూర్వక హామీ ఇచ్చే అంశంపై చర్చ జరిగే అవకాశముంది.