Page Loader
Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో ​​రొనాల్డో.. 100 కోట్లు దాటిన ఫాలోవర్లు
చరిత్ర సృష్టించిన క్రిస్టియానో ​​రొనాల్డో.. 100 కోట్లు దాటిన ఫాలోవర్లు

Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో ​​రొనాల్డో.. 100 కోట్లు దాటిన ఫాలోవర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 13, 2024
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) గురించి తెలియని ఫుట్‌బాల్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. పోర్చుగల్‌కు చెందిన ఈ స్టార్‌ ఆటగాడు తాజాగా సోషల్ మీడియా ప్రపంచంలో సరికొత్త రికార్డు సృష్టించాడు. రొనాల్డో సోషల్ మీడియా ఖాతాలన్నింటి కలిపి ఫాలోవర్ల (Social Media Followers) సంఖ్య 100 కోట్లకు చేరింది. ఈ సందర్భంగా రొనాల్డో ప్రత్యేక పోస్ట్‌ చేస్తూ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.

వివరాలు 

100 కోట్ల మంది నాపై విశ్వాసం ఉంచారు:  రొనాల్డో 

''మనం చరిత్ర సృష్టించాం.. 100 కోట్ల ఫాలోవర్లు!ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు,మీ అందరి ప్రేమాభిమానాలకు ప్రతీక.మడైరా వీధుల నుంచి ప్రపంచంలో అతిపెద్ద వేదికల వరకు నా ప్రయాణంలో ఎల్లప్పుడూ నా కుటుంబంతో, మీరు ఉన్నారు. ఇప్పుడు 100 కోట్ల మంది నాపై విశ్వాసం ఉంచారు. నా జీవితంలోని అన్ని దశల్లో మీరు నా వెంట నిలబడ్డారు. ఇది మన ప్రయాణం. మనం కలిస్తే ఏదైనా సాధించగలమని నిరూపించాం. నాపై విశ్వాసం ఉంచి నాకు ఎల్లవేళలా అండగా నిలిచినందుకు, నా జీవితంలో భాగమైనందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా నా ఉత్తమ ప్రదర్శన ఇంకా చూపించాల్సి ఉంది. మరిన్ని విజయాలు సాధించాలి, కొత్త చరిత్రలు సృష్టించాలి" అని రొనాల్డో తెలిపారు.

వివరాలు 

యూట్యూబ్‌లోకి ప్రవేశించిన వెంటనే భారీ సక్సెస్

ఇటీవల రొనాల్డో యూట్యూబ్‌లోకి ప్రవేశించిన వెంటనే భారీ సక్సెస్ సాధించాడు. ప్రారంభించిన కొద్దిసేపటికే ఫాలోవర్ల సంఖ్య కోటి దాటడం విశేషం. ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఖాతా 6 కోట్ల మందికిపైగా ఫాలోవర్లను కలిగి ఉంది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో 63.9 కోట్ల మంది, 'ఎక్స్‌'లో 11.3 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 17 కోట్ల మంది రొనాల్డోను అనుసరిస్తున్నారు.