రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టడానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా ఖాతా తెరవలేదు. ఆడిన రెండు మ్యాచ్‌లోనూ ఢిల్లీ పరాజయం పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. నేడు రాజస్థాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ పోరుకు సిద్ధమైంది. ఢిల్లీ జట్టులో డేవిడ్ వార్నర్ మినహా మిగతా బ్యాటర్లు రాణించడం లేదు. రంజీలో అద్భుతంగా ఆడిన పృథ్వీషా, సర్ఫరాజ్‌ఖాన్ ఐపీఎల్‌లో మాత్రం విఫలమవుతున్నారు. ఇక విదేశీ ప్లేయర్లు రూసో, పావెల్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడడం లేదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అభిషేక్ పొరెల్, అక్షర్‌పటల్ నిలకడగా ఆడటంతో ఢిల్లీ మోస్తారు స్కోరు చేయగలిగింది. బౌలింగ్ పరంగా కుల్దీప్‌యాదవ్, అక్షర్ రాణిస్తున్నా మిగిలిన వారి నుంచి సరైన సహకారం లభించడం లేదు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో బలంగా రాజస్థాన్ రాయల్స్
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ఢిల్లీ కంటే మెరుగ్గా కనిపిస్తోంది. జోస్ బట్లర్, సంజూ శాంసన్, దేవ్‌దత్ ఫడిక్కల్‌లతో బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ ఉంది. బౌలింగ్‌లోనూ అశ్విన్, చాహెల్ తో సహా సీనియర్ పేసర్ బౌల్ట్ రాజస్థాన్‌కు ప్రధాన ఆస్త్రంగా నిలుస్తున్నారు. ఇప్పటివరకూ రెండు మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్.. సన్ రైజర్స్ పై విజయం సాధించగా.. పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది. అయితే నేటి మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఢిల్లీ ఏ మేరకు కట్టడి చేస్తుందో సాయంత్రం వరకూ వేచి చూడాలి