Shikhar Dhawan: జట్టులో పేరు లేకపోవడంతో షాకయ్యా.. అవకాశం వస్తే నిరూపించుకుంటా : ధావన్
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ భారత జట్టు తరఫున ఆడటానికి దాదాపుగా దారులన్నీ మూసుకుపోయాయి. ఎందుకంటే ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనబోయే జట్టుకు తొలుత ధావనకే జట్టు పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ భారత క్రికెట్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్‌గా నియమించారు. యువ ఆటగాళ్ల కోసం సెలెక్టర్లు ధావన్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈ విషయంపై తొలిసారిగా ధావన్ స్పందించాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకూ చైనాలోని హంగ్జౌలో ఏషియన్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి ఆ టోర్నీలో క్రికెట్‌ను కూడా భాగం చేశారు.
యువ ప్లేయర్ల రాకతో శిఖర్ ధావన్ కు అవకాశాలు దూరం
ఆసియా గేమ్స్ కు వెళ్లే భారత జట్టులో తన పేరు లేకపోవడంతో షాక్‌కు గురయ్యాయయని, సెలెక్టర్లు భిన్నమైన ఆలోచనతో ఉన్నారని, ఏదిఏమైనా వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని ధావన్ చెప్పుకొచ్చారు. రుతురాజ్ కెప్టెన్‌గా చేయడంపై ఎంతో సంతోషంగా ఉందని, యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తారని, అవకాశం వస్తే మళ్లీ నిరూపించుకుంటానని ధావన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో రోహిత్ శర్మతో కలిసి శిఖర్ ధావన్ ఎన్నోసార్లు జట్టుకు శుభారంభాన్ని అందించిన విషయం తెలిసిందే. కొన్ని సంవత్సరాల పాటు ఈ జోడీ టీమిండియాకు ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ లను అందించారు. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వీ జైస్వాల్ రాకతో శిఖర్ ధావన్ కు అవకాశాలు తగ్గిపోయాయి.