Page Loader
IND vs NZ:కేఎల్‌ రాహుల్‌కు మద్దతుగా గౌతమ్ గంభీర్.. ఫైనల్ XIను సోషల్ మీడియా ఎంపిక చేయదంటూ..
కేఎల్‌ రాహుల్‌కు మద్దతుగా గౌతమ్ గంభీర్.. ఫైనల్ XIను సోషల్ మీడియా ఎంపిక చేయదంటూ..

IND vs NZ:కేఎల్‌ రాహుల్‌కు మద్దతుగా గౌతమ్ గంభీర్.. ఫైనల్ XIను సోషల్ మీడియా ఎంపిక చేయదంటూ..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2024
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ తన తొలి టెస్టులో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు విఫలమైనా, రెండో ఇన్నింగ్స్‌లో పటిష్టంగా పోరాడారు. కానీ, ఒక ఆటగాడు మాత్రం పూర్తిగా విఫలమై విమర్శలకు గురయ్యాడు. ఇప్పుడు,అతను జట్టులో తన స్థానాన్ని ప్రమాదంలో నెట్టేసుకున్నాడు. అయినా, టీమ్ మేనేజ్‌మెంట్‌ అతడికి మద్దతుగా నిలిచింది. ఆ ఆటగాడే సీనియర్‌ కేఎల్ రాహుల్‌. సోషల్‌ మీడియాలో అతనిపై తీవ్రంగా ట్రోలింగ్‌ జరుగుతోంది. సర్ఫరాజ్‌ ఖాన్‌ సెంచరీ సాధించడంతో, రాహుల్‌కు తదుపరి టెస్టుల్లో అవకాశం దక్కడం కష్టమేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

రాహుల్  సామర్థ్యం మాకు తెలుసు: గంభీర్ 

''సోషల్‌ మీడియా ఏమనుకుంటుందో పట్టించుకోనవసరం లేదు. తుది జట్టును ఎంపిక చేసేది మేనేజ్‌మెంట్‌ మాత్రమే. కేఎల్ రాహుల్‌ చాలా మంచి ఆటగాడు. బంగ్లాదేశ్‌పై కాన్పూర్‌ వికెట్‌ మీద మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో కొంతమంది ఇబ్బంది పడ్డా, రాహుల్ మాత్రం అర్ధశతకం సాధించాడు.అతని సామర్థ్యం మాకు తెలుసు, అతడిపై విశ్వాసం ఉంది. అందుకే అతడికి మద్దతుగా నిలుస్తున్నాం. ప్రతీ ఒక్కరి ప్రదర్శనను పరిశీలిస్తూనే ఉంటాం'' అని గంభీర్‌ చెప్పారు. రిషబ్ పంత్‌ కూడా బాగున్నాడని, అతడే గురువారం జరిగే రెండో టెస్టులో కీపింగ్‌ బాధ్యతలు చేపడతాడని గంభీర్‌ పేర్కొన్నారు.

వివరాలు 

ఓటమిపై స్పందిస్తూ..

''క్రీడల్లో గెలుపోటములు సహజం. ఒక్కోసారి క్రికెట్‌లో ప్రత్యర్థి విజయం సాధిస్తుంది. కాన్పూర్‌లో భారత అభిమానులు మ్యాచ్‌ ఆస్వాదించారు. బెంగళూరులో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. అక్కడ రెండున్నర రోజుల్లో మ్యాచ్ ముగిసింది, కాని పుణెలో పరిస్థితి వేరుగా ఉంటుంది'' అని గంభీర్‌ వివరించారు. రాహుల్‌ కష్టపడి శ్రమిస్తున్నాడు. భారత జట్టు ఇప్పటికే పుణె చేరుకుని ప్రాక్టీస్‌ ప్రారంభించింది. రెండో టెస్టులో రాహుల్‌ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.