Page Loader
ENG vs IND: శుభ్‌మన్‌ సూపర్‌ సెంచరీ.. మెరిసిన జైస్వాల్‌.. రెండో టెస్టులో భారత్‌ 310/5
శుభ్‌మన్‌ సూపర్‌ సెంచరీ.. మెరిసిన జైస్వాల్‌.. రెండో టెస్టులో భారత్‌ 310/5

ENG vs IND: శుభ్‌మన్‌ సూపర్‌ సెంచరీ.. మెరిసిన జైస్వాల్‌.. రెండో టెస్టులో భారత్‌ 310/5

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐదో టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయినప్పటికీ, టీమిండియా ఆత్మవిశ్వాసం మాత్రం చెదరలేదు. ఇంతకు ముందు ఎనిమిది టెస్టుల్లో ఒక్క విజయమూ సాధించలేని వేదిక అయినా యువ భారత జట్టు భయపడలేదు. రెండో టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత జట్టు, తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 310 పరుగులు చేసింది. కొత్తగా కెప్టెన్సీ చేపట్టిన శుభమన్‌ గిల్‌ (216 బంతుల్లో 12 ఫోర్లతో 114 నాటౌట్‌) సిరీస్‌లో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు. యశస్వి జైస్వాల్‌ (107 బంతుల్లో 13 ఫోర్లతో 87 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

వివరాలు 

ఆరంభంలో.. ఆఖర్లో..: 

గిల్‌కు భాగస్వామిగా ఉన్న జడేజా (67 బంతుల్లో 5 ఫోర్లతో 41 నాటౌట్‌) కీలకంగా నిలిచాడు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు కలిసి 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ (2/59) మెరుగైన ప్రదర్శన చేశాడు. టాస్‌ మళ్లీ ఇంగ్లాండ్‌కే దక్కింది. భారత్‌ మళ్లీ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. కానీ ఈసారి తొలి టెస్టులోలా భారత ఓపెనర్లు ధీమాగా ఆడలేకపోయారు. ముందునుంచి ధైర్యంగా ఆడలేని పరిస్థితి ఏర్పడింది. అది తొలి టెస్టు ఓటమి ప్రభావం కావచ్చు, లేక పేసర్లకు అనుకూలంగా ఉన్న పిచ్‌ వల్ల కావచ్చు. జైస్వాల్, రాహుల్‌ ఆచితూచి ప్రారంభించగా, లీడ్స్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన వోక్స్‌ తన స్వస్థలమైన ఎడ్జ్‌బాస్టన్‌లో మాత్రం అసాధారణంగా బౌలింగ్ చేశాడు.

వివరాలు 

ఆరంభంలో.. ఆఖర్లో..: 

ఈ పరిస్థితుల్లో భారత ఓపెనర్లు అతి జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ, 9వ ఓవర్లో వోక్స్‌ బంతిని స్టంప్స్‌పైకి ఆడిన రాహుల్‌ (2) అవుట్‌ అయ్యాడు. మొదటి గంటలో భారత జట్టు పరుగులు చేయలేక ఇబ్బంది పడింది. కానీ ఆ తర్వాత పరిస్థితి మారింది. క్రీజులో సెట్‌ అయిన జైస్వాల్, కరుణ్‌ నాయర్‌(50 బంతుల్లో 5 ఫోర్లతో 31)స్ట్రోక్ ప్లే ప్రదర్శించారు. షాట్లను సమర్థవంతంగా ఆడి స్కోరు వేగాన్ని పెంచారు. ప్రారంభ 11 ఓవర్లలో 21 పరుగులు చేసిన భారత జట్టు, తదుపరి 11 ఓవర్లలో 70 పరుగులు చేసి స్కోరు బోర్డుపై ప్రభావం చూపింది. లంచ్‌కు ముందు భారత్‌ 95/1 వద్ద నిలిచింది. కానీ లంచ్‌కు ముందే కరుణ్‌ నాయర్‌ ఔటయ్యాడు.

వివరాలు 

నిలిచిన కెప్టెన్‌:

కార్స్‌ వేసిన షార్ట్ బాల్‌ను అట్టడుగు చేయబోయి స్లిప్‌లో చిక్కాడు. విరామానికి స్కోరు 98/2. తొలి సెషన్‌ ప్రారంభం, ముగింపుల్లో భారత్‌ తడబడినప్పటికీ, మధ్యలో తన ఆధిపత్యాన్ని చూపించగలిగింది. లంచ్ అనంతరం భారత్‌ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో సెషన్‌లో కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 84 పరుగులు చేసింది. ఆ వికెట్ కూడా యశస్వి నిర్లక్ష్యంగా తన చేతులారా సమర్పించుకున్నది. శతకానికి సమీపంలో ఉన్న అతను, ఆఫ్‌ స్టంప్‌ దూరంగా వెళ్తున్న బంతిని స్టోక్స్‌ వేసిన సమయంలో వెంటాడి క్యాచ్‌ ఇచ్చాడు. ఆ వికెట్‌ పడడానికి ముందు ఇంగ్లాండ్‌కు అసహనం తప్పలేదు. నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్‌ గిల్‌ అద్భుత డిఫెన్స్‌తో ఇంగ్లిష్‌ బౌలర్లను పరీక్షించాడు.

వివరాలు 

నిలిచిన కెప్టెన్‌:

మరో ఎండ్‌లో యశస్వి మెరుపు షాట్లు ఆడుతూ స్కోరు వేగం పడిపోకుండా చూసుకున్నాడు. గిల్‌ తొలి 33 బంతుల్లో కేవలం 8 పరుగులు చేసినప్పటికీ, ఆ తర్వాత కొంచెం వేగం పెంచాడు. జైస్వాల్‌ రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొని, ఆఫ్‌ సైడ్‌లో కట్ షాట్లతో మెరిపించాడు. అతడిని ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌కు కొంత ఉపశమనం ఇచ్చిన స్టోక్స్‌ తర్వాత రిషబ్‌ పంత్‌ (25)తో గిల్‌ మూడో భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్‌ 208/3కి చేరుకుంది.

వివరాలు 

నితీశ్‌కు నిరాశ:

భారత్‌ తొలి రోజు ఆటను నిలకడగా ముగిస్తుందనుకున్న సమయంలో మూడో సెషన్‌లో స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. బషీర్‌ బౌలింగ్‌లో లాంగాన్‌లో భారీ సిక్సర్ కొట్టిన పంత్‌ మరలా అలాంటి ప్రయత్నంలో క్రాలీ చేతికి చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్లో నితీశ్‌ కుమార్‌ (1) ఔటయ్యాడు.సిరీస్‌లో తొలిసారి ఆడుతున్న నితీశ్‌ వోక్స్‌ వేసిన ఇన్‌స్వింగర్‌ను అంచనా వేయలేక చేతులు పైకెత్తగా,బంతి లోపలికి తిరిగి స్టంప్స్‌ను గిరాటేసింది. భారత్‌ 208/3 నుంచి ఒక్కసారిగా 211/5కి వెనుకబడింది.ఈ దశలో ఇంగ్లాండ్ బౌలర్లు భారత జట్టును కుప్పకూల్చేస్తారా? అన్న అనుమానాలు అభిమానుల్లో కలిగాయి. కానీ గిల్‌, జడేజా ఆ పరిస్థితిని అడ్డుకున్నారు. ఇద్దరూ బాధ్యతతో బ్యాటింగ్‌ చేస్తూ స్కోరు వేగాన్ని నిలబెట్టారు.

వివరాలు 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 

గిల్‌ తన 90ల్లోకి వచ్చిన తర్వాత,జో రూట్‌ వేసిన ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి శతకం పూర్తి చేశాడు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) జేమీ స్మిత్‌ (బి) స్టోక్స్‌ 87; రాహుల్‌ (బి) వోక్స్‌ 2; కరుణ్‌ నాయర్‌ (సి) బ్రూక్‌ (బి) కార్స్‌ 31; శుభ్‌మన్‌ బ్యాటింగ్‌ 114; పంత్‌ (సి) క్రాలీ (బి) బషీర్‌ 25; నితీశ్‌ (బి) వోక్స్‌ 1; జడేజా బ్యాటింగ్‌ 41; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (85 ఓవర్లలో 5 వికెట్లకు) 310; వికెట్ల పతనం: 1-15, 2-95, 3-161, 4-208, 5-211; బౌలింగ్‌:వోక్స్‌ 21-6-59-2; కార్స్‌ 16-2-49-1; టంగ్‌ 13-0-66-0; స్టోక్స్‌ 15-0-58-1; బషీర్‌ 19-0-65-1; రూట్‌ 1-0-8-0