
ENG vs IND : మూడో టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న లార్డ్స్ మైదానంలో భారత రికార్డు ఎలా ఉందంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ లోని తొలి టెస్టులో ఓటమి చెందిన భారత జట్టు,ఆ తర్వాత జరిగిన రెండో టెస్టులో అద్భుతంగా తిరిగి పుంజుకుని విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా కొనసాగుతోంది. ఇకపై లార్డ్స్‌లో జులై 10 నుంచి 14 వరకు జరగబోయే మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని భారత్‌తో పాటు ఇంగ్లాండ్ జట్టు కూడా పట్టుదలగా ఉంది. ఇప్పటికే లార్డ్స్‌కు చేరుకున్న ఇరు జట్ల క్రికెటర్లు మైదానంలో తీవ్రంగా శ్రమిస్తూ మ్యాచ్‌కు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తమ ప్రత్యర్థిపై గెలుపొందాలనే లక్ష్యంతో జట్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. సాధారణంగా లార్డ్స్ మైదానం పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వివరాలు
భారత్ 19 టెస్టుల్లో 12 మ్యాచ్‌లలో పరాజయం
ఇలాంటి నేపథ్యంలో భారత్ ఇప్పటి వరకు ఈ మైదానంలో ఎన్ని సార్లు ఆడింది? ఎన్ని విజయాలు సాధించింది? ఇప్పుడు తెలుసుకుందాం. లార్డ్స్‌లో భారత జట్టు రికార్డులు ఆశాజనకంగా లేవు. ఇప్పటి వరకు భారత్ ఈ మైదానంలో మొత్తం 19 టెస్టులు ఆడగా, 12 మ్యాచ్‌లలో పరాజయం ఎదురైంది. కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. మిగతా నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ మైదానంలో ఇంగ్లాండ్ టీమ్ భారత్‌పై సాధించిన అత్యధిక స్కోరు 653 పరుగులు కాగా, భారత్ సాధించిన గరిష్ట స్కోరు 454 పరుగులు మాత్రమే.
వివరాలు
మూడో టెస్టులో జస్‌ప్రీత్ బుమ్రా
లార్డ్స్ మైదానం పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరు జట్లు తమ తుది జట్లలో కొన్ని మార్పులతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. పని భారాన్ని పరిగణనలోకి తీసుకుని జస్‌ప్రీత్ బుమ్రాకు రెండో టెస్టులో విశ్రాంతి ఇచ్చిన భారత్, ఇప్పుడు మూడో టెస్టులో అతడిని తుది జట్టులోకి తీసుకోనుందని కెప్టెన్ శుభమన్ గిల్ స్పష్టం చేశాడు. ఇక ఇంగ్లాండ్ జట్టు విషయంలో గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్‌లను జట్టులోకి తీసుకునే అవకాశముంది.