కోహ్లీలా దూకుడును పెంచుకోవాలి.. రోహిత్ శర్మకు పాక్ మాజీ క్రికెటర్ సూచన
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా జట్టు వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనుంది. ఈ పర్యటనలో భారత జట్టు టెస్టు, వన్డే, టీ20 మ్యాచులను ఆడనుంది. దీంతో పాటు టెస్టు జట్టుకు వైస్‌కెప్టెన్‌గా రహానే, వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాను ఎంపిక చేశారు.
రోహిత్‌శర్మ యథావిధిగా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అయితే ఆసియాకప్, ప్రపంచకప్ దృష్ట్యా పూర్తిస్థాయి జట్టును వెస్టిండీస్‌కు పంపుతున్నారు. ప్రపంచ కప్‌కు సిద్ధమవుతున్న తరుణంలో భారత్‌కు వెస్టిండీస్ సిరీస్ చాలా ముఖ్యమైనది.
ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్, కెప్టెన్ రోహిత్ శర్మకు కీలక సూచనలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలా మైదానంలో రోహిత్ కూడా తన ఉనికిని చాటాలన్నాడు.
Details
సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశమిస్తే బాగుండేది
కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్న తర్వాత టీమిండియా సారథిగా రోహిత్ శర్మ గొప్పగానే రాణించాడని, అయితే విరాట్ కోహ్లీ మాదిరిగానే రోహిత్ కూడా మైదానంలో దూకుడు చూపించాలని అక్మల్ పేర్కొన్నారు.
ఇక వెస్టిండీస్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ లను తీసుకోకపోవడంపై అతను అసంతృప్తి వ్యక్తం చేశాడు.
టీమిండియాలో ఒకరిద్దరు ఆటగాళ్ల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుందని, రికార్డుల పరంగా చూస్తే సర్ఫరాజ్ ఖాన్ బాగా రాణిస్తున్నాడని, అతనికి టెస్టు జట్టులో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు.
జులై 12 నుంచి వెస్టిండీస్ పర్యటన ప్రారంభమవుతుంది.