Rohit Sharama: గంభీర్‌తో పని చేయడం సంతోషకరం.. అతను ఎవరికీ తలవంచే రకం కాదు.. రోహిత్ శర్మ
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్‌తో కలిసి పనిచేస్తూ భారత జట్టును ముందుకు నడిపిస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ తర్వాత ఇప్పుడు గంభీర్ భారత జట్టుతో కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ముక్కుసూటిగా మాట్లాడే గంభీర్ తన బాధ్యతలో మిశ్రమ ఫలితాలు అందుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ సందర్భంగా రోహిత్, గంభీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ గంభీర్ తలవంచే రకం కాదని, చివరి వరకూ పోరాడటమే అతని ధోరణి అని రోహిత్ జియో సినిమా ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడిన అతని అనుభవం ద్వారా తాము చాలా నేర్చుకుంటామని, ఇప్పుడు గంభీర్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు.
తాము ఎవరినీ కావాలని తొలగించలేదు : గౌతమ్ గంభీర్
కెప్టెన్‌గా తన బాధ్యత జట్టును ముందుకు నడిపించడం మాత్రమే కాక, సహచరుల ప్రదర్శనను అత్యుత్తమంగా తీర్చిదిద్దడం కూడా ముఖ్యమని రోహిత్ శర్మ తెలిపారు. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రాణించిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ వంటి యువ క్రికెటర్లు బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ఎంపిక కాకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీనిపై గౌతమ్ గంభీర్ స్పందించారు. భారత క్రికెట్‌లో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కొదవ లేదని, తుది జట్టు ఎంపిక చాలా కఠినమైన పని అని, తాము కావాలని ఎవరిని తొలగించలేదన్నారు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ లాంటి సీనియర్ల రీ ఎంట్రీతో యువ ఆటగాళ్లకు చోటు లభించడం కష్టమేనని గంభీర్ అన్నారు.