Hardik pandya: గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ రీఎంట్రీకి బ్రేక్.. కెప్టెన్సీ విషయంలోనే అసలు ట్విస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్‌ను వీడాలని నిర్ణయించుకున్న హార్దిక్.. 2027 సీజన్‌కు ముందు తన పాత ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌కు తిరిగి వెళ్లేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, కెప్టెన్సీ పగ్గాలు తనకే ఇవ్వాలనే షరతు పెట్టడంతో ఈ డీల్ చివరి దశలో బెడిసికొట్టినట్లు సమాచారం. దీంతో హార్దిక్ ఐపీఎల్ భవిష్యత్తుపై మరింత ఉత్కంఠ నెలకొంది. హార్దిక్‌ను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తొలుత సుముఖంగానే ఉన్నట్లు సమాచారం.
వివరాలు
కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో చర్చ..
ఈ విషయాన్ని ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తోనూ చర్చించగా.. అతడు కూడా హార్దిక్ రాకకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
అయితే జట్టులోకి తిరిగి రావాలంటే కెప్టెన్సీ బాధ్యతలు తనకే అప్పగించాలని హార్దిక్ షరతు విధించినట్లు సమాచారం.
దీంతో నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉన్నవారంతా దీనికి అంగీకరించలేదని తెలుస్తోంది.
''హార్దిక్ తిరిగి రావడంపై ఫ్రాంచైజీకి ఎలాంటి అభ్యంతరం లేదు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కూడా చర్చించాం.
అతడు కూడా ఓకే అన్నాడు. కానీ కెప్టెన్సీ ఇవ్వాలనే షరతు పెట్టడంతో అందరూ వద్దన్నారు'' అని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
వివరాలు
హార్దిక్ పాండ్యా వాదన..
అయితే ఈ వ్యవహారంపై హార్దిక్ పాండ్యా ప్రతినిధిని సంప్రదించగా.. ఆయన భిన్నమైన వాదన వినిపించారు.
హార్దిక్ ఏ ఫ్రాంచైజీతోనూ నేరుగా ట్రేడ్ లేదా బదిలీపై చర్చలు జరపలేదని స్పష్టం చేశారు.
ఒకవేళ ఏదైనా సంప్రదింపులు జరిగితే.. అవి ముంబై ఇండియన్స్ ద్వారానే జరుగుతాయని తెలిపారు.
ఇదిలా ఉంటే హార్దిక్‌ను చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ట్రేడ్ చేసే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వివరాలు
2022లో ఐపీఎల్ టైటిల్..
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోనే గుజరాత్ టైటాన్స్ 2022లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది.
2023లోనూ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత హార్దిక్ తన పాత జట్టు ముంబై ఇండియన్స్‌కు తిరిగి వెళ్లాడు.
అయితే అక్కడ రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంతో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
డ్రెస్సింగ్ రూమ్‌లోనూ రోహిత్‌కు ఉన్నంత గౌరవం, పట్టు హార్దిక్‌కు లభించలేదనే వార్తలు అప్పట్లో వచ్చాయి.
మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టును పునర్‌నిర్మించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాతో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లను వదులుకునే అవకాశముందని సమాచారం.