Page Loader
Hong Kong Sixes Tournament: 'హాంకాంగ్ సిక్సెస్' టోర్నమెంట్ నవంబర్ 1 నుంచి.. రూల్స్ ఎలా ఉన్నాయంటే?
'హాంకాంగ్ సిక్సెస్' టోర్నమెంట్ నవంబర్ 1 నుంచి 3 వరకు.. రూల్స్ ఎలా ఉన్నాయంటే?

Hong Kong Sixes Tournament: 'హాంకాంగ్ సిక్సెస్' టోర్నమెంట్ నవంబర్ 1 నుంచి.. రూల్స్ ఎలా ఉన్నాయంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2024
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐకానిక్ క్రికెట్ టోర్నమెంట్ 'హాంకాంగ్ సిక్సెస్‌ టోర్నమెంట్' మరలా అభిమానులను అలరించడానికి సిద్దమైంది. ఈ టోర్నీ నవంబర్ 1 నుంచి 3 వరకు జరగనుందని క్రికెట్ హాంకాంగ్ సోమవారం తన ఎక్స్ ద్వారా తెలిపింది. 1992లో మొదలైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. 2017 వరకు కొనసాగిన విషయం తెలిసిందే. 2017 నుంచి 2023 వరకు ఏడేళ్ల పాటు నిర్వహించలేదు. 2024లో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి తిరిగి వస్తోంది. ఈ టోర్నీలో భారత్ కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. 2024 హాంకాంగ్ సిక్సెస్‌ టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి.

Details

నో బాల్స్ కు రెండు ఎక్స్ ట్రా పరుగులు

ఆస్ట్రేలియా, టీమిండియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, హాంకాంగ్, నేపాల్, ఒమన్, యూఏఈ జట్లు పాల్గొననున్నాయి. ప్రతి జట్టులో ఆరుగురు ప్లేయర్స్ ఉంటారు. ఒక మ్యాచ్‌లో ప్రతి జట్టు 5 ఓవర్లు ఆడనుంది. ఈ టోర్నీ సాధారణ మ్యాచ్‌ల్లో ప్రతి ఓవర్‌కు 6 బంతులే వేస్తారు. కానీ ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం ఓవర్‌కు ఎనిమిది బంతులుంటాయి. వికెట్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరూ ఒక్కో ఓవర్ వేయాల్సి ఉంటుంది. వైడ్ లేదా నో బాల్‌కు రెండు ఎక్స్‌ట్రా పరుగులు లభిస్తాయి. 5 ఓవర్లు పూర్తికాక ముందే ఐదు వికెట్లు పడితే టీమ్ ఆలౌట్ కాదు. ఆరో ఆటగాడు (నాటౌట్ బ్యాటర్) బ్యాటింగ్‌ను కొనసాగిస్తాడు

Details

2005లో ఛాంపియన్ గా నిలిచిన భారత్

అయితే ఐదవ వికెట్‌గా ఔటైన బ్యాటర్‌ రన్నర్‌గా ఉంటాడు. అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం ఉండదు. ఆరో ప్లేయర్ మాత్రమే ఎప్పుడూ స్ట్రైకింగ్ చేస్తాడు. ఆరవ వికెట్ కూడా పడితే.. అప్పుడు టీమ్ ఆలౌట్ అవుతుంది. ఇక ఓ బ్యాటర్ 31 పరుగులు చేస్తే.. అతడు రిటైర్డ్‌ హర్ట్‌ అవ్వాల్సి ఉంటుంది. మిగిలిన బ్యాటర్లందరూ ఔట్ లేదా రిటైర్డ్‌ హర్ట్‌ అయిన తర్వాత మరలా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీలు పాల్గొన్నారు. ఈ టోర్నీలో భారత్ 2005లో ఛాంపియన్‌గా నిలిచింది.