IND vs BAN: కేఎల్ రాహుల్ ఎంట్రీ.. సర్ఫరాజ్ కు చోటు దక్కేనా
భారత క్రికెట్ జట్టులో ఎప్పుడూ తీవ్ర పోటీ ఉండటం సాధారణ విషయం. జట్టులో సీనియర్ ఆటగాళ్ల హవా ఉండటంతో, యువ క్రికెటర్లు తమ అవకాశాల కోసం నిరీక్షించాల్సి వస్తుంది. ఒకవేళ సిరీస్‌కు ఎంపికైనా, తుది జట్టులో స్థానం సంపాదించడం సవాలే. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో రాణించిన సర్ఫరాజ్ ఖాన్ పరిస్థితి కూడా అలాంటిదే. జనవరిలో ఇంగ్లండ్ తో టెస్ట్ అరంగేట్రం చేసిన సర్ఫరాజ్, మూడు వరుస హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నా, బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో అతనికి చోటు దక్కే అవకాశాలు సన్నగిల్లాయి.
సర్ఫరాజ్‌కు తుది జట్టులో అవకాశం
సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్‌లో విశేషంగా రాణించినా, భారత జట్టులో చాలా ఆలస్యంగా అవకాశం వచ్చింది. దీనికి ప్రధాన కారణం సీనియర్ ప్లేయర్స్ ఉండడమే. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌కి ముందు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు జట్టులో నుండి తప్పుకోవడం, రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం, కేఎల్ రాహుల్ గాయపడటం లాంటి పరిణామాలు సర్ఫరాజ్‌కు తుది జట్టులో అవకాశం తెచ్చాయి. వచ్చిన అవకాశాన్ని సర్ఫరాజ్ సమర్ధంగా ఉపయోగించుకుని వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసి తన ప్రతిభను నిరూపించాడు. దాంతో సర్ఫరాజ్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు.
దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ లో ఆడాలని సర్ఫరాజ్‌కి ఆదేశం
ఇటీవల టీమిండియా ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడింది.అయితే త్వరలో బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. 2024 దులీప్ ట్రోఫీకి ఇండియా బి తరపున ఆడిన సర్ఫరాజ్ మొదటి ఇన్నింగ్స్‌లో 9పరుగులు చేసినప్పటికీ,రెండో ఇన్నింగ్స్‌లో 36 బంతుల్లో 46 పరుగులతో చెలరేగాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఎంపికైన సర్ఫరాజ్‌కు గాయపడిన సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ జట్టులో ఉండడంతో మళ్లీ నిరాశే ఎదురుకానుంది. బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత భారత్ న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్ట్‌లు,ఆపై ఆస్ట్రేలియాలో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. కీలక మ్యాచ్‌ల ఉన్నదృష్ట్యా రాహుల్ జట్టులో ఉండే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఆడాలని ఆదేశించారు.