వింబుల్డన్ ప్రైజ్‌మనీ భారీగా పెంపు.. ఒక్కో విజేతకు 24.60 కోట్లు
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ -2023 ప్రైజ్ మనీ ఈ దఫా భారీగా పెంచేశారు. జులై 3 నుంచి 16 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రైజ్ మనీ వివరాలను ఆల్ ఇంగ్లండ్ క్లబ్ బుధవారం ప్రకటించింది. ఈసారి వింబుల్డన్ ప్రైజ్ మనీ మొత్తంగా 11శాతానికి పెరిగింది. దీంతో సింగిల్స్ విజేతలు ఒక్కొక్కరు రూ.24.60 కోట్లు అందుకోనున్నారు. 2019 పోల్చుకుంటే ఈ మొత్తం ప్రైజ్ మనీ 17.10శాతం పెరిగింది. ఇక ఈ ఏడాది టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ రూ.463 కోట్లు కావడం విశేషం.
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ బరిలో జొకోవిచ్, రిబాకానా
గతేడాది సింగిల్స్ విజేతలకు 20లక్షల పౌండ్ల చొప్పున అందజేశారు. ఈసారి 3 లక్షల 50వేల పౌండ్లు అదనంగా ఇవ్వున్నారు. అదే విధంగా మెయిన్ 'డ్రా' తొలి రౌండ్ లో ఓడిన క్రీడాకారులకు 55 వేల పౌండ్లు దక్కనున్నాయి. క్వాలిఫయింగ్ తొలి రౌండ్ లో ఓడితే 12 వేల 750 పౌండ్లు, రెండో రౌండ్ లో ఓడితే 21 వేల 750 పౌండ్లు, మూడో రౌండ్ లో ఓడితే 36 వేల పౌండ్లు లభించనున్నాయి. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ -2023లో పురుషుల సింగిల్స్ లో జొకోవిచ్ (సెర్బియా), మహిళ సింగిల్స్ లో రిబాకానా (కజికిస్తాన్) డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగనున్నారు.