Page Loader
ICC: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఐసీసీ సీఈవోగా తప్పుకున్న జియోఫ్ అల్లార్డిస్ 
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఐసీసీ సీఈవోగా తప్పుకున్న జియోఫ్ అల్లార్డిస్

ICC: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఐసీసీ సీఈవోగా తప్పుకున్న జియోఫ్ అల్లార్డిస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభానికి ముందే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సీఈవో జెఫ్ అలార్డీస్ తన పదవి నుంచి వైదొలిగారు. అయితే, ఆయన రాజీనామా చేయడానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి పాకిస్థాన్ సరైన ఏర్పాట్లు చేయలేకపోవడమే అలార్డీస్ రాజీనామా చేయడానికి ఒక కారణమని ఐసీసీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. 2025 ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. భద్రతా కారణాల నేపథ్యంలో భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లకుండా, దుబాయ్ వేదికగా తన మ్యాచ్‌లను ఆడనుంది.

వివరాలు 

కొత్త సీఈవో నియామక ప్రక్రియ

క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన 57 ఏళ్ల జెఫ్ అలార్డీస్ 2012లో జనరల్ మేనేజర్‌గా ఐసీసీలో చేరారు. 2021 నవంబర్‌లో ఐసీసీ సీఈవోగా నియమితులయ్యారు. అయితే, ఆయన రాజీనామాకు గల కారణాలను ఐసీసీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే, అలార్డీస్ అత్యంత అంకితభావంతో పని చేసిన వ్యక్తి అని ఐసీసీ ఛైర్మన్ జై షా అన్నారు. త్వరలోనే కొత్త సీఈవో నియామక ప్రక్రియను ఐసీసీ ప్రారంభించనుంది. ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య జట్టు అయిన పాకిస్థాన్‌లో కరాచీ,రావల్పిండిలో మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే, ఈ వేదికల స్టేడియాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా లేవని సోషల్ మీడియాలో వెలువడిన ఫొటోలు,వీడియోలు తెలియజేస్తున్నాయి. దీంతో, పాక్ ట్రోఫీ నిర్వహణకు పూర్తిగా సిద్ధంగా ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

ఐసీసీలో వరుస రాజీనామాలు

పైగా, ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాక్‌కు అప్పగించినందుకు ఐసీసీపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, ఐసీసీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. హెడ్ ఆఫ్ ఈవెంట్స్ క్రిస్ టెట్లే, యాంటీ కరప్షన్ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షల్, మార్కెటింగ్ & మీడియా హెడ్ క్లెయిర్ ఫర్లోంగ్ వ్యక్తిగత కారణాలను చూపుతూ తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డీస్ రాజీనామా చేయడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సన్నద్ధంగా లేకపోవడం, ఐసీసీలో వరుస రాజీనామాలు చోటుచేసుకోవడం మరింత ఆసక్తికరంగా మారాయి.