ICC Test Rankings: అగ్రస్థానానికి దూసుకొచ్చిన జోరూట్.. బౌలింగ్‌లో అగ్రస్థానంలోనే అశ్విన్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో విజృంభించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. యాషెస్ సిరీస్ తొలి టెస్టులో సెంచరీ బాదిన అతను 887 పాయింట్లతో నెంబర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ మార్నస్ లబుషేన్ సుమారు ఆరు నెలల తర్వాత అగ్రస్థానాన్ని కోల్పోవడం విశేషం. ప్రస్తుతం 887 పాయింట్లతో రెండు స్థానాలు దిగజారి మూడో ర్యాంకుకు దిగజారాడు. ఐపీఎల్‌లో గాయపడిన కేన్ విలియమ్సన్ (883 పాయింట్లు) రెండు స్థానాలు మెరుగుర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. ఇక టీమిండియా నుంచి రిషబ్ పంత్ 758 పాయింట్లతో టాప్-10లో కొనసాగుతున్నాడు. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఒకస్థానం కోల్పోయి 14వ ర్యాంకుకు చేరుకున్నాడు.
ఆల్ రౌండర్ విభాగంలో రవీంద్ర జడేజా మొదటి స్థానం
ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్థానంలో నిలిచాడు. 860 పాయింట్లతో టాప్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ 829 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడా 825 పాయింట్లతో ఓ స్థానం మెరుగుపరుచుకొని మూడో స్థానానికి చేరాడు. ఇక టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఎనిమిది, రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఇక టెస్టు ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా మొదటి స్థానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా యువ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ నాలుగో స్థానంలో ఉన్నాడు.