IND vs SA Preview: నువ్వా? నేనా?.. టీమిండియా జోరుకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేస్తుందా? బర్త్ డే భాయ్ కోహ్లీపై ఫోకస్
ప్రపంచ కప్-2023లో అసలైన పోరుకు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియా, భారీ గెలుపులతో ఉత్సాహంగా ఉన్న దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి. 65,000 మంది ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న చారిత్రాత్మకమైన ఈడెన్ గార్డన్స్ వేదికగా నువ్వా? నేనా? అన్నట్లు పోటీ పడనున్నాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క ఓటమిని కూడా చవిచూడని టీమిండియాకు ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా నుంచి అత్యంత కఠినమైన సవాలు ఎదురుకాబోతోంది. వరుసగా 7మ్యాచ్‌లను గెలిచి, మిగతా రెండింట్లో కూడా విజయం సాధించి, పాయింట్స్ టేబుల్‌లో మొదటిస్థానంలో నిలవాలన్న చూస్తున్న టీమిండియా ఆశలకు సౌతాఫ్రికా గండికొడుతుందా? లేక టీమిండియా జోరును కొనసాగిస్తుందా?
ఫైనల్‌కు ముందు ఫైనల్ మ్యాచ్‌లా..
టీమిండియా, దక్షిణాఫ్రికా ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో మొదటి రెండుస్థానాల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ రెండు జట్లలో టీమిండియా ఇప్పుటి వరకు 7 గేమ్స్ ఆడితే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇక సౌతాఫ్రికా ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఒక మాత్రమే ఓడిపోయి 6గేమ్స్‌లో భారీ విజయాలను నమోదు చేసింది. ఇప్పటి వరకు టీమిండియా ఆడిన ఏడు మ్యాచ్‌లు కూడా దాదాపు ఏకపక్షంగానే సాగాయి. అయితే దక్షిణాఫ్రికాతో మ్యాచ్ మాత్రం, టీమిండియాకు అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా కఠినమైన సవాలును ఎదుర్కోబోతోందని నిపుణులు అంటున్నారు. ఒకరంగా ఈ మ్యాచ్ ను 'ఫైనల్‌కు ముందు ఫైనల్'గా పరిగణిస్తున్నారు.
'బర్త్‌డే బాయ్' విరాట్ కోహ్లీ, రోహిత్ పైనే అందరి ఫోకస్
పన్నెండేళ్ల తర్వాత తన గడ్డపై వన్డే ప్రపంచకప్‌ను గెలవాలనే ఉద్దేశంతో రోహిత్ సేన కసితో ఆడుతోంది. ప్రస్తుత ప్రపంచ కప్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ ఈ టోర్నీలు అద్భుతంగా రాణిస్తున్నారు. నవంబర్ 5వ తేదీ విరాట్ కోహ్లీ బర్త్. ఈడెన్ స్టేడియంలో కోహ్లికి మంచి రికార్డు ఉంది. దీంతో కోహ్లీ నుంచి మంచి ఇన్నింగ్ ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈడెన్ గార్డెన్ కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా ఫేవరెట్ స్టేడియం. అతను ఇదే నవంబర్ 2014లో శ్రీలంకపై వన్డే క్రికెట్‌లో 264పరుగులతో రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ 442పరుగులతో టీమిండియా బ్యాటర్లలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. రోహిత్ 402 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.
స్టేడియం గణాంకాలు ఇలా ఉన్నాయి
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన 37వన్డేల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 21సార్లు గెలిచాయి. ఇక్కడి మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 240పరుగులు. భారత్ ఈ స్టేడియంలో ఆడిన 22వన్డేల్లో 13సార్లు గెలిచింది. 2014లో శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో 404/5అత్యధిక స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లోనే రోహిత్ 264పరుగులతో రెచ్చిపోయాడు. 1993లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అత్యల్ప 195పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియానే గెలిచింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా మూడింటిలో విజయం సాధించగా, భారత్ రెండింట్లో విజయం సాధించింది. వన్డే క్రికెట్‌లో, ఇరు జట్ల మధ్య జరిగిన 90మ్యాచ్‌లలో, భారత్ 37 గెలిచింది. దక్షిణాఫ్రికా 50 గెలిచింది. మూడింట్లో ఫలితం తేలలేదు.
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత పేసర్లు
టీమిండియా బౌలింగ్ గురించి మాట్లాడితే.. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ ఇద్దరూ ఐదు కంటే తక్కువ ఎకానమీ రేటుతో అద్భుతంగా రాణిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా 15 వికెట్లు, షమీ 14 వికెట్లు తీశారు. బుమ్రా మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడగా, షమీ కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లో, మహ్మద్ సిరాజ్ ఏడు ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4.40 సగటుతో 10 వికెట్లు), రవీంద్ర జడేజా (3.78 సగటుతో తొమ్మిది వికెట్లు) మిడిల్ ఓవర్లలో తమ పనిని చక్కగా నిర్వర్తించారు.
టోర్నీలో అదరగొడుతున్న దక్షిణాఫ్రికా బ్యాటర్లు
దక్షిణాఫ్రికా గురించి చెప్పాలంటే, పూణెలో జరిగిన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 190 పరుగుల తేడాతో ఓడించింది. దక్షిణాఫ్రికా సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి కేవలం ఒక విజయం మాత్రమే అవసరం. దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో ఓడినా, సెమీఫైనల్‌కు క్వాలిఫై కావడానికి ఇబ్బంది ఏమీ ఉండదు. సౌతాఫ్రికాకు ఉన్న భారీ రన్‌రేట్ కారణంగా టాప్4 టీమ్స్‌లో దక్షిణాఫ్రికా ఉంటుంది. చివరి ప్రపంచకప్‌ఆడుతున్న డి కాక్(545 పరుగులు) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో అతను 4సెంచరీలు చేశాడు. దక్షిణాఫ్రికా ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదు సార్లు 300కంటే ఎక్కువ స్కోర్ చేసిందంటే, ఆ జట్టు ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ టీమ్‌లో మార్క్రామ్(362 పరుగులు), డుస్సెన్(353 పరుగులు), క్లాసెన్(315 పరుగులు) అద్భుతంగా రాణిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో బద్దలయ్యే రికార్డులు ఇవే..
వన్డే ప్రపంచకప్‌లో కుమార సంగక్కర చేసిన పరుగులను అధిగమించడానికి కోహ్లీకి 61పరుగులు అవసరం. వన్డే వరల్డ్ కప్‌లో 1,500పరుగులు పూర్తి చేయడానికి కోహ్లీకి 28పరుగులు అవసరం. ప్రపంచకప్‌లో 50వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా నిలిచేందుకు షమీ(45)కి మరో ఐదు వికెట్లు కావాలి. ఈ ఏడాది వన్డేల్లో 1,000 పరుగులు పూర్తి చేసేందుకు మార్క్రామ్ 61పరుగులు చేయాల్సి ఉంది. వన్డేల్లో 50వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా నిలిచేందుకు సౌతాఫ్రికా బౌలర్ కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు అవసరం. టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జడేజా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ కృష్ణ.