Page Loader
Team India: ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం.. నమోదైన అద్భుత రికార్డులివే!
ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం.. నమోదైన అద్భుత రికార్డులివే!

Team India: ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం.. నమోదైన అద్భుత రికార్డులివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 07, 2025
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు చరిత్రాత్మక విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అనే అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో భారత్ 366 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌ గణనీయమైన రికార్డులను తన ఖాతాలో నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 547 పరుగులు చేయగా, ప్రత్యర్థి జట్టు 389 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 507/3 వద్ద డిక్లేర్ చేయగా, ఇంగ్లాండ్‌ 608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే భారత పేసర్ ఆకాశ్ దీప్ దెబ్బకు ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌటైంది. దీంతో మ్యాచ్ మొత్తం 1692 పరుగులు నమోదయ్యాయి.

Details

ఈ అద్భుత విజయంతో భారత జట్టు, ఆటగాళ్లు కింది రికార్డులు సాధించారు

విదేశీ గడ్డపై పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద టెస్టు విజయం — 366 పరుగుల తేడా. ఎడ్జ్‌బాస్టన్ వేదికపై టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 1967లో ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి మ్యాచ్ ఆడిన భారత్, 58 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు అక్కడ తొలి విజయం నమోదు చేసింది. SENA దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) 30 టెస్టు విజయాలు సాధించిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా నిలిచింది. విదేశాల్లో అత్యల్ప వయసులో టెస్టు విజయాన్ని అందుకున్న భారత కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒకే టెస్టులో డబుల్ సెంచరీతో పాటు రెండోఇన్నింగ్స్‌లో 150కిపైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గిల్ రికార్డుకెక్కాడు

Details

రెండో బౌలర్ గా ఆకాశ్ దీప్ రికార్డు

ఇంగ్లాండ్ వేదికగా ఒకే టెస్టులో 10 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా ఆకాశ్ దీప్ (10/187) నిలిచాడు. గతంలో 1986లో చేతన్ శర్మ (10/188) ఇదే వేదికపై ఈ ఘనత సాధించారు. మొత్తం 1692 పరుగులు నమోదు కావడం భారత్-ఇంగ్లాండ్ టెస్టు చరిత్రలో అత్యధికంగా ఉండడం విశేషం. ఈ విజయం ద్వారా భారత్ తన టెస్టు స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.