Page Loader
IND vs ENG: నేడు ఇంగ్లాండ్‌తో భారత్‌ నాలుగో టీ20 
నేడు ఇంగ్లాండ్‌తో భారత్‌ నాలుగో టీ20

IND vs ENG: నేడు ఇంగ్లాండ్‌తో భారత్‌ నాలుగో టీ20 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి ఓటమిని ఎదుర్కొన్న భారత జట్టు కీలకమైన పోరుకు సిద్ధమవుతోంది. తిరిగి గెలుపు బాట పట్టి సిరీస్‌ను చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని భారత జట్టు శుక్రవారం పుణెలో జరిగే నాలుగో టీ20లో బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్‌లో భారత బ్యాటింగ్‌ విభాగం ప్రత్యర్థిపై పటిష్ఠ ఆధిపత్యం ప్రదర్శించినా, ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో బలహీనంగా కనిపించింది. రెండో టీ20లో తిలక్‌ వర్మ మెరుగైన ప్రదర్శనతో జట్టును ఆదుకున్నప్పటికీ, మూడో మ్యాచ్‌లో బ్యాటింగ్ విఫలమవడంతో ఓటమి తప్పలేదు. ముఖ్యంగా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ పేలవ ఫామ్‌ భారత జట్టుకు ఆందోళనకర అంశంగా మారింది.

వివరాలు 

ఈ సిరీస్‌లో నిరాశపరిచిన సంజు శాంసన్‌ 

గత ఏడు టీ20లలో అతడి అత్యధిక స్కోరు 21 మాత్రమే కాగా, ప్రస్తుత సిరీస్‌లో వరుసగా 0, 12, 14 పరుగులు మాత్రమే సాధించాడు. కీలకమైన సమయంలో కెప్టెన్‌ నిరాశ పరచడం జట్టుకు ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. గత ఏడాది కొన్ని అపూర్వ ఇన్నింగ్స్‌లు ఆడిన వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ సంజు శాంసన్‌ కూడా ఈ సిరీస్‌లో నిరాశపరిచాడు. వరుసగా 26, 5, 3 పరుగులు మాత్రమే చేశాడు. తిలక్‌ వర్మ, అభిషేక్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా మంచి ఫామ్‌లో ఉన్నా, వారిలో ఒక్కొక్కరే మెరుగైన ప్రదర్శన చూపిస్తున్నారు. కనీసం ఇద్దరు లేదా ముగ్గురు బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడడం భారత విజయానికి కీలకం.

వివరాలు 

నిరాశపరిచిన రవి బిష్ణోయ్‌

ఇంగ్లాండ్‌ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో మెరుగుదల కనిపిస్తుంటే, భారత జట్టు స్థాయిని కోల్పోతున్నట్లు అనిపిస్తోంది. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ,మిగతా బౌలర్ల ప్రదర్శన గత మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో లేదు. ఏడాదికి పైగా విరామం తర్వాత జట్టులోకి వచ్చిన సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఆకట్టుకోలేకపోయాడు. రవి బిష్ణోయ్‌ విపరీతంగా పరుగులిచ్చి నిరాశపరిచాడు. అక్షర్‌ పటేల్‌ మాత్రం నిలకడగా బౌలింగ్‌ చేస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ ఒకే ఒక్క ప్రధాన పేసర్‌తో బరిలోకి దిగుతూ, ముగ్గురు స్పిన్నర్లను ఉపయోగించింది. పుణెలో కూడా ఇదే వ్యూహాన్ని కొనసాగిస్తారా లేదా వాషింగ్టన్‌ సుందర్‌ లేదా రవి బిష్ణోయ్‌ను తప్పించి షమీ, అర్ష్‌దీప్‌లను కలిపి రెండు పేసర్లను ఆడిస్తారా అన్నది చూడాలి.

వివరాలు 

ఉత్సాహంగా ఇంగ్లాండ్‌: 

పుణె పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని అంచనా. తొలి టీ20లో భారీ ఓటమి అనంతరం ఇంగ్లాండ్‌ సమర్థవంతంగా పుంజుకుంది. మూడో టీ20లో ప్రదర్శన ఆ జట్టు నమ్మకాన్ని పెంచింది. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ నిలకడగా రాణిస్తుండగా, డకెట్‌, లివింగ్‌స్టన్‌ తమ ఫామ్‌ను అందుకున్నారు. ఫిల్‌ సాల్ట్‌, హ్యారీ బ్రూక్‌ గాడిలో పడితే ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌కు మరింత బలమవుతుంది. బౌలింగ్‌ విభాగంలో క్రిస్‌ కార్స్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, ఒవర్టన్‌ రిథమ్‌ను అందుకున్నారు. పిచ్‌ పరిస్థితులను బట్టి ఒక పేసర్‌ను తగ్గించి, రషీద్‌కు తోడుగా రెహాన్‌ అహ్మద్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది.

వివరాలు 

రింకు సిద్ధం: 

వెన్నునొప్పి కారణంగా గత రెండు టీ20లకు దూరమైన మిడిలార్డర్‌ బ్యాటర్‌ రింకు సింగ్‌ ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా తిరిగి జట్టులోకి వచ్చాడు. నాలుగో టీ20 కోసం అతను సిద్ధంగా ఉన్నాడు. మ్యాచ్‌కు ముందు రోజున ప్రాక్టీస్‌ చేసిన అతడు, రిషభ్‌ పంత్‌ తరహాలో ర్యాంప్‌, స్కూప్‌ షాట్లు ప్రాక్టీస్‌ చేయడం విశేషం. రింకు తుది జట్టులోకి వస్తే జురెల్‌ స్థానాన్ని కోల్పోవాల్సి ఉంటుంది.

వివరాలు 

తుది జట్లు (అంచనా)... 

భారత్‌: సంజు శాంసన్, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్య, రింకు సింగ్‌/శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్, మహ్మద్‌ షమి. ఇంగ్లాండ్‌: ఫిల్‌ సాల్ట్, బెన్‌ డకెట్, జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌), హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టన్, జేమీ స్మిత్‌/బెతెల్, బ్రైడన్‌ కార్స్, జేమీ ఒవర్టన్, అడిల్‌ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్‌ వుడ్‌.