World Cup 2023 : సొంతగడ్డపై ఒత్తిడి ఎక్కువ.. మళ్లీ ఆ తప్పు చేస్తారేమో : వసీం అక్రమ్
ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఇండియా చివరిసారిగా 2011లో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. భారత్ వేదికగా 2023లోనూ వరల్డ్ కప్ జరగబోతోంది. ఈసారి భారత జట్టు ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. అయితే ట్రోఫీని కచ్చితంగా గెలుస్తారో లేదో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం టీమిండియా గెలుపు అవకాశాలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ స్పందించాడు. స్వదేశంలో ఆడుతున్న టీమిండియాకి ఒత్తిడి ఎక్కువ ఉంటుందని, 2015, 2019 సెమీఫైనల్ లో ఓడిన భారత జట్టుకు ఇది గట్టి హెచ్చరిక అని పేర్కొన్నాడు.
స్వదేశంలో ఆడడం వల్ల అదనపు ప్రయోజనాలు
స్వదేశంలో ఆడడం వల్ల మెరుగైన ప్రయోజనాలు ఉంటాయని, అయితే ఆటగాళ్లపై ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుందని వసీం అక్రమ్ చెప్పాడు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, అయితే జస్ప్రిత్ బుమ్రా ఫిట్టనెస్ కొంత ఆందోళనకరంగా ఉందన్నారు. మంచి స్పిన్నర్లు ఉన్నా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఎవరు ఆడతారో తెలియదన్నారు ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ జట్టు ఏ వేదికపైనా అయినా మ్యాచును ఆడుతుందని, తమ ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం ఉండదని వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు.