IND Vs AUS : ఆస్ట్రేలియా గెలుపునకు ఇషాన్ కిషన్ తప్పిదమే కారణమా?
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత జట్టు వరుస విజయాలకు బ్రేక్ పడింది. సిరీస్ నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో ఆస్ట్రేలియా జట్టు చెలరేగడంతో విజయం సాధించింది. కొండంత లక్ష్యాన్ని చేధించి అద్భుత విజయాన్ని అందుకుంది. గ్లెన్ మాక్స్‌వెల్ 104 నాటౌట్ చెలరేగడంతో ఆసీస్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) చేసిన తప్పిదం ఆస్ట్రేలియా జట్టుకు కలిసొచ్చింది. అతని అత్యుత్సాహం కారణంగానే భారత్ ఓటమిపాలైంది. ఆసీస్ గెలుపునకు చివరి 9 బంతుల్లో 33 పరుగులు అవసరమయ్యాయి.
ఫ్రీ హిట్ లో సిక్స్ కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన వేడ్
ఈ క్రమంలో అక్షర్ పటేల్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతిని మాథ్యూ వేడ్ ముందుకొచ్చే ఆడటానికి ప్రయత్నించాడు. బంతి మిస్ అయి ఇషాన్ చేతిలో పడింది. ఆ వెంటనే స్టంపింగ్ కూడా చేశాడు. అయితే రిప్లేలో అది నాటౌట్‌గా తేలింది. బంతిని పట్టుకున్న క్రమంలో ఇషాన్ గ్లోవ్స్ స్టంప్స్ కన్నా ముందుకు రావడంతో థర్డ్ ఆంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు ఫ్రీ హిట్ రావడంతో మాథ్యూ వేడ్ ఆ బంతిని సిక్స్ గా మలిచాడు. చివరి బంతికి నాలుగు పరుగులు రావడంతో చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరమయ్యాయి. ఇక జోరుమీదున్న మాక్స్ వెల్ అలవోకగా సిక్సులు బాది ఆసీస్ జట్టుకు విజయాన్ని అందించాడు.