LOADING...
IPL 2026: ఇషాన్‌కు గోల్డెన్ ఛాన్స్..ఐపీఎల్ కెప్టెన్‌గా సక్సెస్ అవుతాడా?
ఇషాన్‌కు గోల్డెన్ ఛాన్స్..ఐపీఎల్ కెప్టెన్‌గా సక్సెస్ అవుతాడా?

IPL 2026: ఇషాన్‌కు గోల్డెన్ ఛాన్స్..ఐపీఎల్ కెప్టెన్‌గా సక్సెస్ అవుతాడా?

వ్రాసిన వారు Moogati Shabari
Mar 22, 2026
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

మెరుపు బ్యాటింగ్‌తో "పాకెట్ డైనమో"గా గుర్తింపు పొందిన ఇషాన్ కిషన్, తన కెరీర్ ప్రారంభంలోనే వన్డేల్లో డబుల్ సెంచరీతో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అయితే ఆ తరువాత క్రమశిక్షణ లోపంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయి టీమిండియా నుంచి దూరమయ్యాడు. కానీ అతనికి మళ్లీ అవకాశాలు త్వరగా వచ్చాయి. తాజా టీ20 ప్రపంచకప్‌లో చురుకైన ఇన్నింగ్స్‌లతో జట్టు విజయంలో భాగస్వామి అయ్యాడు. 2026 ఐపీఎల్‌లో ప్యాట్ కమిన్స్ గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడటంతో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును నడిపించే బాధ్యత ఇషాన్ కిషన్‌పై పడింది. గత ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఝార్ఖండ్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన అతడు, ఇప్పుడు ఐపీఎల్ వేదికలో కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడో ఆసక్తికరంగా మారింది.

వివరాలు

సవాలు అంత సులభం కాదు

2024 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన సంచలనంగా నిలిచింది. ఆ సీజన్‌లో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ రికార్డు నాలుగుసార్లు బద్దలైంది. ఫైనల్ వరకు వెళ్లినప్పటికీ టైటిల్‌ను కేవలం కొద్ది తేడాతో కోల్పోయింది. ఇప్పుడు మరోసారి జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ వంటి పవర్ హిటర్లతో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. గత ఏడాది 11.25 కోట్ల రూపాయలకు ఇషాన్‌ను తీసుకున్న సన్‌రైజర్స్, అతనిపై నమ్మకం ఉంచింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తొలి మ్యాచ్‌లోనే 47 బంతుల్లో 106 నాటౌట్‌తో అద్భుత సెంచరీ చేశాడు. తరువాత అదే స్థాయిలో నిలకడగా రాణించకపోయినా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.

వివరాలు

ఝార్ఖండ్ కెప్టెన్‌గా విజయం

ఇక ఝార్ఖండ్ కెప్టెన్‌గా కూడా ఇషాన్ తన సామర్థ్యాన్ని నిరూపించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో జట్టును విజయవంతంగా నడిపించి, ఝార్ఖండ్‌కు తొలి టైటిల్ అందించాడు. హరియాణాతో జరిగిన ఫైనల్లో 49 బంతుల్లో 101 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మొత్తం 11 మ్యాచ్‌ల్లో 517 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే ఫామ్‌ను దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ, తరువాత టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగించాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌పై 40 బంతుల్లో 77 పరుగుల ఇన్నింగ్స్ అతని ప్రతిభను చాటింది. అయితే ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించడం అతనికి కొత్త అనుభవం. ఒత్తిడి ఎక్కువగా ఉండే ఈ టోర్నీలో అతను ఎలా నడిపిస్తాడో చూడాలి.

Advertisement

వివరాలు

కెప్టెన్‌గా మంచి రికార్డు

టీ20 ఫార్మాట్‌లో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించి, అందులో 24 విజయాలు సాధించాడు. కెప్టెన్సీ బాధ్యతల మధ్య కూడా అతని బ్యాటింగ్‌లో ఎలాంటి తగ్గుదల కనిపించలేదు. మొత్తం 29 మ్యాచ్‌ల్లో 1079 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడే టీ20ల్లో ఏడు సెంచరీలు నమోదు చేయడం విశేషం. 2025-26 ముస్తాక్ అలీ ఫైనల్లో 45 బంతుల్లో శతకం సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో సుమారు 200 స్ట్రైక్‌రేట్‌తో 9 మ్యాచ్‌ల్లో 317 పరుగులు చేశాడు. ఈ ఫామ్‌ను ఐపీఎల్‌లో కూడా కొనసాగిస్తాడా? కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రెండింట్లోనూ అదే స్థాయి ప్రదర్శన ఇస్తాడా? అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Advertisement