
Kedar Jadhav: పాక్‌తో మ్యాచ్ అస్సలు ఆడకూడదు.. కేదార్ జాదవ్ సంచలన వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై వివాదం తలెత్తింది. ఈ హై-వోల్టేజ్ పోరును భారత జట్టు బహిష్కరించాలని మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ డిమాండ్ చేశారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి పరిస్థితుల్లో ఇలాంటి మ్యాచ్ అస్సలు ఆడకూడదని ఆయన గట్టిగా పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 14న ఇరు జట్ల మధ్య గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జరగాల్సి ఉన్నా, అది జరుగదని తాను నిశ్చయంగా చెప్పగలనని జాదవ్ స్పష్టం చేశారు. ఏఎన్ఐతో మాట్లాడుతూ జాదవ్, భారత జట్టు ఆ మ్యాచ్ ఆడకూడదని నేను భావిస్తున్నాను. నిజానికి ఆడదని కూడా నేను నమ్ముతున్నాను. ఈ మ్యాచ్ జరగదు, జరగకూడదనే అభిప్రాయం నాది అని తెలిపారు.
Details
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు
గత ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాక్-ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేదార్ జాదవ్‌తో పాటు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా పాక్‌తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని పిలుపునిస్తున్నారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విభిన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
Details
2012-13 నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దు
భారత్-పాక్ క్రికెట్ ఎప్పుడూ ప్రభుత్వ నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మ్యాచ్ తప్పకుండా జరుగుతుందని ఆయన గత నెలలో స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అరికట్టడం అనివార్యమే అయినా, ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఆట కొనసాగాలని గంగూలీ అభిప్రాయపడ్డారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2012-13 నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి.