Kl Rahul: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. కోహ్లీకూ సాధ్యం కాని రికార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 క్రికెట్, ముఖ్యంగా ఐపీఎల్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు విరాట్ కోహ్లీ. ఈ ఫార్మాట్‌లో ఎన్నో అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్న కోహ్లీకి కూడా సాధ్యం కాని ఓ ప్రత్యేక ఘనతను ఇప్పుడు కేఎల్ రాహుల్ అందుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రాహుల్ మరో చారిత్రక మైలురాయిని చేరుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 23 పరుగులు నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అతని పరుగుల సంఖ్య 1000 దాటింది. మ్యాచ్‌లో పెద్ద స్కోరు చేయకపోయినా, ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడూ అందుకోని రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.
వివరాలు
1000కిపైగా పరుగులు చేసిన తొలి క్రికెటర్..
మూడు వేర్వేరు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతి జట్టుకు 1000కిపైగా పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్జెయింట్స్ జట్ల తరఫున ఈ ఘనత సాధించిన రాహుల్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా అదే మైలురాయిని చేరుకున్నాడు. వేర్వేరు జట్ల తరఫున రాహుల్ నమోదు చేసిన పరుగులు: పంజాబ్ కింగ్స్ - 55 మ్యాచ్‌లు - 2548 పరుగులు లక్నో సూపర్ జెయింట్స్ - 38 మ్యాచ్‌లు - 1410 పరుగులు ఢిల్లీ క్యాపిటల్స్ - 24 మ్యాచ్‌లు - 1007 పరుగులు
వివరాలు
సరికొత్త రికార్డు..
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరో ఓవర్లో కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో బౌండరీ కొట్టడం ద్వారా రాహుల్ ఈ 1000 పరుగుల మార్కును చేరుకున్నాడు. అదేవిధంగా, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా కొత్త రికార్డు సృష్టించాడు. కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటివరకు ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్, జేపీ డుమిని 35 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేయగా, రాహుల్ ఆ రికార్డును అధిగమించాడు.
వివరాలు
ఒక ఫ్రాంచైజీ తరఫున అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్లు:
క్రిస్ గేల్ - ఆర్సీబీ - 20 ఇన్నింగ్స్‌లు షాన్ మార్ష్ - పంజాబ్ కింగ్స్ - 21 ఇన్నింగ్స్‌లు లెండిల్ సిమన్స్ - ముంబై ఇండియన్స్ - 23 ఇన్నింగ్స్‌లు కేఎల్ రాహుల్ - పంజాబ్ కింగ్స్ - 23 ఇన్నింగ్స్‌లు కేఎల్ రాహుల్ - ఢిల్లీ క్యాపిటల్స్ - 24 ఇన్నింగ్స్‌లు డెవాన్ కాన్వే - చెన్నై సూపర్ కింగ్స్ - 24 ఇన్నింగ్స్‌లు ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో రాహుల్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై ఆడిన 152 పరుగుల భారీ ఇన్నింగ్స్ అతని దూకుడైన బ్యాటింగ్‌కు నిదర్శనంగా నిలిచింది. సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాహుల్, 180 స్ట్రైక్ రేట్‌తో 468 పరుగులు సాధించాడు.