Tom Latham:భారత పర్యటనలో బ్రాండ్ క్రికెట్‌ను ఆడి విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తాం: టామ్ లేథమ్
శ్రీలంక చేతిలో రెండు టెస్టుల సిరీస్‌ను ఓడిన న్యూజిలాండ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఉన్న కివీస్ ఒక్కసారిగా కిందికి దిగజారింది. భారత్‌తో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ నేపథ్యంలో, టిమ్ సౌథీ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అతడి స్థానంలో టామ్ లేథమ్‌ను సారథిగా నియమిస్తూ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్క్వాడ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, తనకు పూర్తిస్థాయిలో సారథ్య బాధ్యతలు అప్పగించడంపై లేథమ్ స్పందించాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌లో మెరుగైన ఆటతీరు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. కేర్ టేకర్‌గా ఉన్న అతను ఇప్పుడు ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా వచ్చానంటూ వ్యాఖ్యానించాడు.
సహచరుల మద్దతుతో ముందుకు సాగుతాననే నమ్మకం ఉంది: లాథమ్
"పూర్తి స్థాయి కెప్టెన్‌గా నా పేరును ప్రకటించడం ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఇది గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. గతంలోనే జట్టుకు నాయకత్వం వహించాను, అప్పుడు కేర్‌టేకర్ పాత్రలో ఉండగా, ఇప్పుడు పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. నా దైన శైలిలో కొత్తగా ప్రయత్నించి జట్టును ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ నేను వందశాతం సిద్ధంగా లేను. కానీ, సహచరుల మద్దతుతో ముందుకు సాగుతాననే నమ్మకం ఉంది. భారత్‌తో టెస్టు సిరీస్ తేలికేమీ కాదు. కివీస్ బ్రాండ్ క్రికెట్‌ను ఆడి విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తాం" అని లేథమ్ తెలిపాడు.
సిరీస్ ఎప్పటి నుంచి అంటే?
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరు, పుణె, ముంబయి వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. టీమిండియా స్క్వాడ్‌ను ఇంకా సెలక్టర్లు ప్రకటించలేదు. కివీస్ మాత్రం కేన్ విలియమ్సన్ లేకుండానే తొలి టెస్టు ఆడనుంది. గాయం నుంచి కోలుకుంటే, తదుపరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు. కివీస్ స్క్వాడ్ ఇదే.. టామ్ లేథమ్ (కెప్టెన్),టామ్ బ్లండల్ (వికెట్ కీపర్),మైకెల్ బ్రాస్‌వెల్ (తొలి టెస్టుకు),మార్క్ చాప్‌మన్, డేవన్ కాన్వే,మ్యాట్ హెన్రీ,డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ, అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బీన్ సీర్స్, ఐష్ సోధి (2, 3 టెస్టులకు), టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్