Ajinkya Rahane: బాంద్రాలో గవాస్కర్ స్థలం స్వాధీనం.. అజింక్య రహానేకు కేటాయింపు
భారత క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ముంబై బాంద్రాలో ఆయనకు కేటాయించిన 2,000 చదరపు మీటర్ల స్థలాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ స్థలాన్ని ముంబయి రంజీ జట్టు సారథి అజింక్య రహానేకు కేటాయించినట్లు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గవాస్కర్ 1988లో తన ప్రత్యేక ఆటతీరుతో దేశానికి,రాష్ట్రానికి పేరు తీసుకువచ్చాడు. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం బాంద్రాలో 2,000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించింది. ఇది ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయడం, రాబోయే క్రికెటర్లకు శిక్షణ ఇవ్వడం కోసం అందించినట్లు పేర్కొంది.
క్రికెట్ అకాడమీ నిర్మాణం కోసం రహానేకు లీజు
అయితే, గవాస్కర్ ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. ఆ స్థలం దాదాపు 36 ఏళ్లుగా వాడకంలో లేకుండా ఉంది. అందువల్ల, ప్రభుత్వం ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. తరువాత, ఆ స్థలంను అజింక్య రహానేకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్కడ క్రికెట్ అకాడమీ నిర్మాణం కోసం రహానేకు లీజుకు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అజింక్య రహానే గతంలో టీమిండియాలో మూడు ఫార్మాట్‌లలో కీలక ఆటగాడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, తరువాత ఆయన టెస్టులకే పరిమితమయ్యారు. ఆ ఫార్మాట్‌లో కూడా విఫలమవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతూనే, ముంబయి రంజీ జట్టుకు సారథిగా కొనసాగుతున్నాడు.