LOADING...
Surya Kumar Yadav: గిల్‌ వైపు మొగ్గుచూపుతున్న మేనేజ్‌మెంట్‌.. సూర్య కెప్టెన్సీకి గండమేనా?
గిల్‌ వైపు మొగ్గుచూపుతున్న మేనేజ్‌మెంట్‌.. సూర్య కెప్టెన్సీకి గండమేనా?

Surya Kumar Yadav: గిల్‌ వైపు మొగ్గుచూపుతున్న మేనేజ్‌మెంట్‌.. సూర్య కెప్టెన్సీకి గండమేనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టు పగ్గాలు అందుకున్నప్పటి నుంచి ఒక్క సిరీస్‌ కూడా ఓడిపోని కెప్టెన్‌ను ఎవరు తప్పిస్తారు? కానీ, భారత సెలక్టర్లు, కోచ్‌ మాత్రం ఈ దిశగా ఆలోచిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతేడాది టీ20 జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సూర్యకుమార్‌ యాదవ్‌ విజయవంతంగా జట్టును నడిపిస్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఆయనపై వేటు పడొచ్చని వార్తలు వస్తున్నాయి. కారణం మూడు ఫార్మాట్లకీ ఒకే కెప్టెన్‌ ఉండాలన్న ఆలోచన. వచ్చే నెల ఆసియా కప్‌లో మాత్రం సూర్యకుమార్ యాదవ్ సారథ్యం కొనసాగొచ్చు కానీ, తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ఈ టోర్నీలో గట్టిగా తనదైన ముద్ర వేయాల్సిందే.

Details

సూర్య కెప్టెన్సీ ఆరంభం

గత సంవత్సరం టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత రోహిత్‌ శర్మ పొట్టి ఫార్మాట్‌ నుంచి విరమణ చేశారు. దాంతో ఆయన స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను కెప్టెన్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. అప్పటి నుంచి టీ20 జట్టు ప్రదర్శన అద్భుతంగానే ఉంది. వరుస విజయాలతో టీమ్‌ఇండియా ఛాంపియన్‌ హోదాకు తగ్గట్టుగానే నిలిచింది. రోహిత్‌, కోహ్లి దూరమైనప్పటికీ జట్టుపై దాని ప్రభావం కనిపించలేదు. సూర్య సారథ్యంలో శ్రీలంక పర్యటనలో 3-0 క్లీన్‌స్వీప్‌. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ తో 3-0తో గెలుపు. దక్షిణాఫ్రికాలో 4-మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో గెలుపు. ఇంగ్లాండ్‌తో హోం సిరీస్‌లో 4-1 తోవిజయవంతం.

Details

ఘనమైన రికార్డు ఉన్నా పట్టించుకోలేదు

ఇంత ఘనమైన రికార్డు ఉన్నప్పటికీ, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌, కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ పొట్టి క్రికెట్లో కెప్టెన్సీ మార్పు దిశగా ఆలోచిస్తున్నారని సమాచారం. వేర్వేరు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్ల విధానం అంతగా కలిసి రాదన్న కారణంతో, ఒకే నాయకుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు.

Details

గిల్‌ వైపు చూపు 

ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్‌లో తన తొలి కెప్టెన్సీ పరీక్షలో మెరిసిన శుభ్‌మన్‌ గిల్‌కు మూడు ఫార్మాట్లకూ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారని ప్రచారం. ప్రస్తుతం వన్డే జట్టుకు రోహిత్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్నప్పటికీ, ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగరని భావిస్తున్నారు. రోహిత్‌ తప్పుకుంటే గిల్‌ సహజ వారసుడే అవుతాడని అంచనా. టీ20ల్లో కూడా భవిష్యత్‌ దృష్ట్యా శుభ్‌మన్‌కే అవకాశమిస్తే బాగుంటుందని సెలక్టర్లు, కోచ్‌ భావిస్తున్నారట.

Details

సూర్య ప్రతికూలతలు

అయితే సూర్యకు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా జట్టు వరుస విజయాలు సాధించినా, బ్యాటర్‌గా ఆయన వ్యక్తిగత ప్రదర్శన ఆకట్టుకోలేదు. సారథ్యం అందుకున్నాక 15 మ్యాచ్‌లు ఆడి 18.42 సగటుతో కేవలం 258 పరుగులే చేశారు. అందులో రెండు అర్ధశతకాలు మాత్రమే ఉన్నాయి. జట్టు విజయాలు సమష్టి కృషి వల్లేనని, సూర్య ప్రభావం తక్కువగానే ఉందని విమర్శకులు చెబుతున్నారు. ఇక సూర్య వయసు కూడా ఒక అంశమే. ప్రస్తుతం ఆయన 34 ఏళ్ల వయసులో ఉన్నారు. టీ20లు యువకుల ఆట అన్న అభిప్రాయం ఉండటంతో, శుభ్‌మన్‌లాంటి కుర్ర ఆటగాడికి అవకాశం ఇవ్వడం మంచిదని చర్చ సాగుతోంది.

Details

ఆసియా కప్‌ పరీక్షే కీలకం 

కానీ ప్రస్తుతానికి గిల్‌ టీ20 జట్టులో లేరు. అతడిని ప్రధానంగా టెస్టులు, వన్డేల్లో కీలక ఆటగాడిగా పరిగణిస్తున్నారు. అయితే ఐపీఎల్‌లో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా చూపిన ప్రతిభ వల్ల గిల్‌కి టీ20 జట్టులో స్థానం లభించకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆసియా కప్‌కు గిల్‌ను ఎంపిక చేస్తారా లేదా అన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎంపిక చేసినా వెంటనే కెప్టెన్‌గా నియమించకపోవచ్చు. ఈ టోర్నీలో సూర్య సారథ్యం కొనసాగుతుంది. అయితే బ్యాటర్‌గా, కెప్టెన్‌గా సూర్య తన సత్తా చాటితే, ఆయనను తప్పించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలా అయితే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ వరకు కూడా సూర్య సారథ్యం కొనసాగే అవకాశం ఉంది. లేదంటే మాత్రం శుభ్‌మన్‌ గిల్‌కు పగ్గాలు అప్పగించడం ఖాయం అవుతుంది.