Mohammed Shami: అలన్ డొనాల్డ్ రికార్డును బ్రేక్ చేసిన మహ్మద్ షమీ
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగిపోతున్నాడు. ఈ ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో తొలి మ్యాచులో షమీ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో వరల్డ్ కప్‌లలో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అదే విధంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో ఓ అరుదైన రికార్డును షమీ తన ఖాతాలో వేసుకున్నాడు. జానీ బెయిర్‌స్టో (14), బెన్ స్టోక్స్ (0), మొయిన్ అలీ (15) వికెట్లను పడగొట్టి, దక్షిణాఫ్రికా దిగ్గజం అలన్ డోనాల్డ్‌ను షమీ అధిగమించాడు. ఇప్పటివరకూ షమీ ప్రపంచకప్‌లలో 39 వికెట్లను తీయడం విశేషం.
12వ స్థానానికి ఎగబాకిన షమీ
ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 12వ స్థానానికి షమీ ఎగబాకాడు. తద్వారా డొనాల్డ్, జాకబ్ ఓరమ్, డేనియల్ వెట్టోరీలను షమీ అధిగమించాడు. ఇప్పటివరకూ మహ్మద్ షమీ 96 మ్యాచ్‌ల్లో 25.08 సగటుతో 181 వికెట్లు పడగొట్టాడు. చివరి 10 మ్యాచ్‌ల్లో షమీ 21 వికెట్లను తీశాడు. 2015లో 13.78 సగటుతో 14 వికెట్లు తీసిన అతను, 2019లో 7 మ్యాచ్‌ల్లో 17.29 సగటుతో 17 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. హార్దిక్ గాయపడ్డాక జట్టులోకి వచ్చిన షమీ, తన మీద యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.