
Mohammed Siraj: మహ్మద్ సిరాజ్‌కి కెరీర్ బెస్ట్ ర్యాంక్.. టాప్-5లోకి జైస్వాల్..
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తన ఐసీసీ ర్యాంకింగ్ ను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు. ఆయన 12 స్థానాలు ఎగబాకి, కెరీర్‌లో తొలిసారి టాప్-15లో చోటు సంపాదించాడు. ప్రస్తుతం సిరాజ్‌కు 674 రేటింగ్ పాయింట్లు ఉండగా, ఆయన 15వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు ఈ హైదరాబాద్ పేసర్‌కు లభించిన అత్యుత్తమ ర్యాంక్ 16వ స్థానం మాత్రమే. ఇంగ్లాండ్‌తో ఓవల్‌లో జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ తొమ్మిది వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు, భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 25 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంకులో నిలిచాడు.
వివరాలు
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్-5లోకి యశస్వి జైస్వాల్
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం మూడు స్థానాలు వెనకబడడంతో ప్రస్తుతం ఆయన 17వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు ఓవల్ టెస్టులో పాల్గొనకపోయిన జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఓవల్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో శతకం సాధించిన భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్-5లోకి వచ్చాడు. మూడు స్థానాలు మెరుగుపడిన జైస్వాల్‌కు ఇప్పుడు 792 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా, శుభమన్ గిల్ నాలుగు స్థానాలు దిగజారి 13వ స్థానానికి పడిపోయాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు జో రూట్, హ్యారీ బ్రూక్‌లు వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.