Hardik Pandya: హార్ధిక్ పాండ్యా ఇంకా నేర్చుకోవాలి.. కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ కామెంట్
ఐపీఎల్ 2024 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఫామ్ లేమి, గాయాల బెడద కారణంగా 2022 సీజన్ కు ముందు వదిలేసిన ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యా(Hardik Pandya)ను, అనూహ్యా రీతిలో భారీ మొత్తానికి ట్రేడ్ చేసింది. తాజాగా ముంబై ఇండియన్స్(Mumbai Indians) రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి పాండ్యాకు పగ్గాలను అప్పగించింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన హిట్ మ్యాన్‌ను కాదని పాండ్యాను సారిథిగా నియమించడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. ఈ తరుణంలో దీనిపై టీమిండియా(Team India) మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Akash Chopra) స్పందించాడు.
రోహిత్ శర్మపై ఆకాశ్ చోప్రా ప్రశంసలు
హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుండి మారాలని నిర్ణయించుకున్నప్పుడు, కెప్టెన్సీలో ఒక భాగమై ఉండొచ్చని, ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా రోహిత్ శర్మకు మేనెజ్‌మెంట్ కూడా తెలియజేసి ఉంటుందన్నారు. గుజరాత్ టైటాన్స్‌లో హార్దిక్‌ని కెప్టెన్‌గా చేయడంలో ఆశిష్ నెహ్రా ది గొప్ప పాత్ర పోషించాడని, తాను అనుకుంటున్నానని, హార్ధిక్ ఇంకా నేర్చుకోవాలని ఆకాష్ చెప్పాడు. రోహిత్ ఒక లెజెండ్ అని, 10 సంవత్సరాల పాటు జట్టును ముందుండి నడిపించి ఐదు టైటిళ్లను అందించాడని కొనియాడారు. రోహిత్ శర్మ ఎంతో కష్టపడ్డారని, కానీ జట్టు కంటే పెద్దది ఎవరూ లేరని ఆకాష్ చెప్పుకొచ్చాడు. అయితే ఎంఐ కెప్టెన్‌గా పాండ్యా నియామకంపై రోహిత్ ఇంకా స్పందించలేదు.