Page Loader
Harbhajan Singh: "డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతాయి": మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ పోస్ట్‌ నెట్టింట వైరల్‌
"డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతాయి" మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ పోస్ట్‌ నెట్టింట వైరల్‌

Harbhajan Singh: "డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతాయి": మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ పోస్ట్‌ నెట్టింట వైరల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2025
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు తగిన ప్రదర్శన చేయకపోవడంతో వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా స్పందించాడు. టీమ్ ఇండియా "సూపర్‌స్టార్ సంస్కృతి"ని వీడాలని హర్భజన్ సూచించడమే ఈ వివాదానికి కారణమైంది. ఇటీవల,ఈ అంశంపై హర్భజన్ మరోసారి స్పందిస్తూ,''మార్కెట్లో ఏనుగు నడిచినా, డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి''అనే సామెతను తన పోస్టులో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో పెద్ద చర్చకు దారితీశాయి. హర్భజన్ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశాడనే విషయంలో నెటిజన్లు గందరగోళానికి గురవుతున్నారు. కొన్ని క్రికెట్ అభిమానులు,ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని,మాటలు అదుపులో పెట్టుకోవాలని హర్భజన్‌ను హెచ్చరిస్తున్నారు. ఇటీవల,బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌పై హర్భజన్ తన యూట్యూబ్ ఛానల్‌లో విశ్లేషించాడు.

వివరాలు 

టీమ్ ఇండియా సూపర్‌స్టార్ సంస్కృతిని వదిలిపెట్టాలి

రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఉన్నంతకాలం జట్టు బాగా ఆడిందని,కానీ ఈ ఆరు నెలల్లో ఏమైంది అని ప్రశ్నించాడు. ఆసీస్ పర్యటనలో విఫలమైన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లపై స్పందించిన హర్భజన్, ''ప్రతి ఆటగాడికి పేరుప్రఖ్యాతులు ఉంటాయి, కానీ ఆటకంటే ఏదీ ముఖ్యం కాదు. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజులైనా సరే తమ సమయం వచ్చినప్పుడు జట్టునుంచి తప్పుకున్నారు. టీమ్ ఇండియా సూపర్‌స్టార్ సంస్కృతిని వదిలిపెట్టాలి. అభిమన్యు ఈశ్వరన్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసినా ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. సర్ఫరాజ్ ఖాన్ పరిస్థితి కూడా అంతే. పేరున్న ఆటగాళ్లని కాకుండా,నిజంగా బాగా ఆడే ఆటగాళ్లనే ఎంపిక చేయాలి'' అని హర్భజన్ సూచించాడు.