Pakistan team: పతనదిశలో పాక్ క్రికెట్.. గట్టెక్కాలంటే టీమిండియా మోడలే పరిష్కారమా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ జట్టు పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగినా ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లలోనే ఓటమిని చవిచూసింది.
ఆతిథ్య హోదాలో కనీసం సెమీస్ వరకు చేరితేనైనా అభిమానులకు ఊరట కలిగేది. అయితే గత మూడేళ్లుగా ఈ జట్టులో నష్టసూచిక పెరుగుతూనే ఉంది.
అప్పటికే ప్రమాద ఘంటికలు మోగినా, పాక్ మేనేజ్‌మెంట్ పట్టించుకోకపోవడంతో జట్టు దిగజారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు గట్టెక్కాలంటే భారత్ అనుసరిస్తున్న మోడల్‌ను పాటించాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
Details
ఫేవరెట్‌గా బరిలోకి దిగినా ఘోర పరాజయం
పాకిస్థాన్ క్రికెట్‌ను 'పేపర్ పులి'గా అభివర్ణించాల్సిన స్థితి వచ్చేసింది.
రిజ్వాన్ - బాబర్ అజామ్ అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్, యువ క్రికెటర్లు సల్మాన్ అఘా, ఖుష్దిల్ షా, అలాగే పేస్ త్రయం షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్ వంటి ఆటగాళ్లతో పాక్ బలమైన జట్టుగా కనిపించినా, మైదానంలో మాత్రం పూర్తిగా వైఫల్యాన్ని ఎదుర్కొంది.
తొలి మ్యాచ్‌లో బాబర్ అజామ్ హాఫ్ సెంచరీ చేసినా, ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు.
భారత్‌తో మ్యాచ్‌లోనూ రిజ్వాన్ 77 బంతుల్లో 46 పరుగులు మాత్రమే చేసి జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. కుర్రాడు సౌద్ షకీల్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా, రిజ్వాన్ ఆ మూడ్‌ను కొనసాగించలేకపోయాడు.
Details
మూడేళ్లలోనే భారీ మార్పులు!
అలాగే, సరైన ఓపెనర్ లేకపోవడం కూడా జట్టుకు తలనొప్పిగా మారింది. జట్టు ఎంపిక దగ్గర్నుంచే తీసుకున్న నిర్ణయాలు విమర్శలకు దారితీశాయి. సెలక్షన్ కమిటీ నుంచి ప్రధాన కోచ్ వరకు తరచూ మార్పులు చేసుకోవడం పాక్ జట్టు స్థిరతను దెబ్బతీసింది.
తొమ్మిదేండ్లగా స్థిరత కలిగిన భారత క్రికెట్‌తో పోల్చితే, పాక్ జట్టులో కేవలం మూడు సంవత్సరాల్లోనే 26 మంది సెలక్టర్లు, నలుగురు కెప్టెన్లు, 8 మంది కోచ్‌లు మారారు. టెస్టు ఫార్మాట్‌లో దాదాపు 1000 రోజులకు పైగా స్వదేశంలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. విజయవంతమైన కోచ్‌లకు స్థానం లేకుండా చేయడం, సెలక్షన్ కమిటీలో రాజకీయాలు, పక్షపాత ధోరణి పెరగడం వంటి అంశాలు జట్టు నాశనానికి దారితీశాయి.
Details
ఫిట్‌నెస్ లోపమే ప్రధాన సమస్య
2021 నుంచి 2024 వరకు పాక్ జట్టుకు సక్లెయిన్ ముస్తాక్, అబ్దుల్ రహ్మాన్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్, మహమ్మద్ హఫీజ్, అజర్ మహమ్మద్, జాసన్ గిలెస్పీ, గ్యారీ కిరిస్టెన్ వంటి కోచ్‌లు మారుతూ వచ్చారు. ఈ అస్థిరత దేశవాళీ క్రికెట్‌ను పూర్తిగా ప్రభావితం చేసింది.
మోడర్న్ క్రికెట్‌లో ఫిట్‌నెస్ అత్యంత కీలకం. ఆస్ట్రేలియా, భారత్ వంటి జట్లు స్పోర్ట్స్ సైన్స్, డేటా అనలిటిక్స్ ఆధారంగా ప్లేయర్ల ఎంపిక, వ్యూహరచన చేస్తుంటే, పాక్ మాత్రం ఇప్పటికీ పురాతన విధానాలనే కొనసాగిస్తోంది.
పాక్ క్రికెటర్లు సిక్స్‌లు కొట్టడం లేదన్న కారణంతో పీసీబీ మాజీ ఛైర్మన్ ఏకంగా మిలిటరీ క్యాంప్‌లో శిక్షణ ఇప్పించాడు.
కానీ ఆ శిక్షణ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో పాక్ ఘోరంగా వైఫల్యం చెందింది.
Details
భారత మోడల్ అనుసరిస్తే గట్టెక్కుతుందా?
ఒకప్పుడు పాకిస్థాన్ జట్టు బరిలో దిగితే ప్రత్యర్థులకు కఠినమైన సవాల్‌గా ఉండేది. కానీ ప్రస్తుతం స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాక్ ఆటగాళ్లలో గెలుపు కోరిక లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
భారత్‌తో మ్యాచ్‌లోనూ అదే విధంగా నిస్సత్తువగా ఆడింది.
ఇకనైనా పాకిస్థాన్ క్రికెట్ స్ట్రక్చర్‌ను సమీక్షించి, భారత్ మాదిరి ఆధునిక సెలక్షన్ పారామీటర్లను పాటించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
భారత క్రికెట్ బోర్డు మాదిరిగా
స్ట్రాంగ్ జాతీయ క్రికెట్ లీగ్, కోచింగ్ వ్యవస్థ, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ, ఫామ్‌లో లేని ఆటగాళ్లకు దేశవాళీలో ఆడే అవకాశాలు, తిరిగి జట్టులోకి రావడానికి మెరిట్ ఆధారిత ఎంపిక, కెప్టెన్,కోచ్, సెలక్షన్ కమిటీ మధ్య సమన్వయం వంటి అంశాలపై దృష్టి సారించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Details
నూతన ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలి
సీనియర్ల స్థానాలను భర్తీ చేసే క్రమంలో కొత్త ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వడం, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం కీలకం.
భారత్‌లోని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు టీ20లకు వీడ్కోలు పలికినా, వారి స్థానాలను అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్‌లతో భర్తీ చేయడం మంచి ఉదాహరణ.