Page Loader
Pakistan Hockey Team: పాకిస్తాన్ హాకీ జట్టును అడ్డుకోవడం లేదు: కేంద్ర క్రీడాశాఖ 
పాకిస్తాన్ హాకీ జట్టును అడ్డుకోవడం లేదు: కేంద్ర క్రీడాశాఖ

Pakistan Hockey Team: పాకిస్తాన్ హాకీ జట్టును అడ్డుకోవడం లేదు: కేంద్ర క్రీడాశాఖ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే నెలలో ఆసియాకప్ హాకీ టోర్నమెంట్ జరగనుంది. ఈ పోటీలో పాల్గొనడానికి పాకిస్థాన్ హాకీ జట్టు భారత్‌కు రానుంది. ఇటీవల భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, పాకిస్తాన్ హాకీ జట్టుకు భారత్‌లో ఆడేందుకు అనుమతి ఇస్తారా లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే, కేంద్ర క్రీడాశాఖ వర్గాలు ఈ అంశంపై స్పష్టత ఇచ్చాయి. పాకిస్తాన్ జట్టును ఈ ఆసియాకప్ టోర్నమెంట్‌లో అడ్డుకునే ఉద్దేశం తమకు లేదని తెలిపాయి. భారత్‌లో జరుగుతున్న బహుళ జాతి క్రీడా పోటీలలో పాల్గొనే జట్లపై ఎటువంటి ఆంక్షలు విధించడంలేదని స్పష్టం చేశాయి.

వివరాలు 

ఆసియాకప్ హాకీ టోర్నమెంట్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు

అయితే, ద్వైపాక్షిక టోర్నీల విషయంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుందని పేర్కొన్నాయి. అంతర్జాతీయ క్రీడా ప్రమాణాలను బట్టి, తాము తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నామని తెలిపాయి. ఉదాహరణకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు యుద్ధంలో ఉన్నా కూడా, అవి బహుళ జాతుల క్రీడా ఈవెంట్లలో పాల్గొంటూనే ఉన్నాయని గుర్తు చేశాయి. బీహార్‌లోని రాజ్‌గిర్ నగరంలో ఈ ఆసియాకప్ హాకీ టోర్నమెంట్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు నిర్వహించనున్నారు. మరోవైపు, సెప్టెంబర్‌లో జరగబోయే ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొంటుందా? అన్న ప్రశ్నపై కేంద్ర క్రీడాశాఖ స్పందించింది. ఈ అంశంపై బీసీసీఐ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. బీసీసీఐ తమను సంప్రదించినప్పుడు, తగిన సమాచారం అందిస్తామని వెల్లడించింది.