Pardhiv Patel: గుజరాత్ టైటాన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పార్థివ్ పటేల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025కి ముందు గుజరాత్ టైటాన్స్ పార్థివ్ పటేల్‌కు కీలక బాధ్యతలను అప్పగించింది. టైటాన్స్ జట్టుకు బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా పార్థివ్‌ను నియమించింది. అతను గతంలో ముంబై ఇండియన్స్‌కి స్కౌట్‌గా, ముంబై ఎమిరేట్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇంతకు ముందు పార్థివ్ చాలా జట్లతో కలిసి ఐపీఎల్ ఆడాడు. ఈ సందర్బంగా గుజరాత్ టైటాన్స్ అధికారిక ప్రకటన చేసింది. టైటాన్స్ రాబోయే ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమవుతోందని, పార్థివ్ యువ బ్యాటర్లకు మార్గనిర్దేశం చేస్తారని తెలిపింది. కోచింగ్ సిబ్బందిని బలోపేతం చేయడం, వారి అభివృద్ధికి పార్థివ్ దోహదపడుతాడని పేర్కొంది.
ఐపీఎల్లో ఆరు జట్లకు ఆడిన పార్థివ్ పటేల్
పార్థివ్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌తో సహా 6 జట్లకు ఆడాడు. 139 ఐపీఎల్ మ్యాచ్‌లలో 22.6 సగటుతో 2,848 పరుగులు చేశాడు. ఇందులో 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇకపోతే గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ జట్టు 12 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్య నేతృత్వంలో ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.