Sanju Samson: సంజూ శాంసన్ చెత్త ఆట.. ఇక భవిష్యత్తులో చోటు కష్టమే!
టీమిండియా,వెస్టిండీస్ పర్యటనలో బిజీ బిజీగా ఉంది. టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్, ఇప్పుడు టీ20 సిరీస్‌ను ఆడుతోంది. ఈ సిరీస్‌లో మాత్రం టీమిండియా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా టీ20జట్టులో స్థానం దక్కించుకున్న సంజూ శాంసన్ ప్రదర్శన విషయంలో ఎంతోమంది అభిమానులు నిరాశ చెందుతున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక సంజూ శాంసన్ దారుణంగా విఫలమవుతున్నాడు. సెలెక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. విండీస్ తో జరిగిన తొలి టీ20ల్లో 12 పరుగులు, రెండో టీ20లో 7 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ లో అద్భుతమైన ఫామ్ ను కొనసాగించిన సంజూశాంసన్ టీ20ల్లో మాత్రం తేలిపోతున్నాడు.
సంజూశాంసన్ పేలవ ప్రదర్శన
జూలై 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన శాంసన్, తన రెండో మ్యాచ్ ఆడటానికి నాలుగేళ్లకు పైగా సమయం పట్టింది. 2022 నుండి ఇప్పటివరకూ ఎనిమిది టీ20 మ్యాచుల్లో వరుసగా 39, 18, 77, 30*, 15, 5, 12, 7 పరుగులు చేశాడు. కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో శాంసన్ కు ప్రస్తుతం జట్టులో చోటు లభించింది. రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వన్డే వరల్డ్ కప్‌కి సిద్ధంగా ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. అలోగా శాంసన్ తన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే టీమిండియా జట్టులో భవిష్యతుల్లో అవకాశం దక్కే వీలు ఉండదు.