Paris Paralympics 2024: భారత్‌కు మూడో పతకం.. 100 మీటర్ల ఈవెంట్‌లో ప్రీతి పాల్ కాంస్యం
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ తన మూడో పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100 మీటర్ల టీ35 విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 14.21 సెకన్లలో రేసును పూర్తి చేసి, వ్యక్తిగతంగా మెరుగైన రికార్డును నెలకొల్పింది. పారాలింపిక్స్ 2024లో భారత్‌కు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఇదే తొలి పతకం కావడం గమనార్హం. ఈ రేసులో చైనా అథ్లెట్లు స్వర్ణం,రజత పతకాలను సొంతం చేసుకున్నారు. జియా జౌ 13.58 సెకన్లలో రేసును ముగించి స్వర్ణ పతకం సాధించగా, గౌ 13.74 సెకన్లలో రజత పతకాన్ని అందుకుంది.
షూటింగ్ విభాగంలో రెండు పతకాలను గెలిచిన భారత ఆటగాళ్లు
అంతకుముందు, ఇవాళ జరిగిన షూటింగ్ విభాగంలో భారత ఆటగాళ్లు రెండు పతకాలను గెలిచారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 విభాగంలో అవని లేఖర స్వర్ణ పతకాన్ని సాధించడంతో పాటు తన గత రికార్డును మెరుగుపర్చింది. అవని టోక్యో పారాలింపిక్స్‌లో కూడా స్వర్ణ పతకాన్ని గెలిచింది. మరోవైపు, మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పారాలింపిక్స్‌లో మొదటిసారిగా పాల్గొన్న మోనా, తన తొలి విశ్వక్రీడల్లోనే కాంస్య పతకాన్ని సాధించి భారత షూటింగ్ రంగంలో భవిష్యత్ తారగా ఎదిగింది.