దులీప్ ట్రోఫీలో వెస్ట్‌జోన్ జట్టుకు ఆడనున్న పుజారా, సూర్య
గత నెలలో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియా జట్టులో ఛతేశ్వర్ పుజారా, సూర్యకుమార్ యాదవ్‌కు స్థానం కల్పించలేదు. దీంతో దేశవాళీ టోర్నీ దులిప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ జట్టు తరుపున వీరిద్దరూ ఆడనున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో పుజారా రాణించకపోవడంతో బీసీసీఐ అతనిపై వేటు వేసింది. మరోవైపు ఆస్ట్రేలియాతో ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా సూర్యకుమార్ యాదవ్ టెస్టు అరంగ్రేటం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇప్పటివరకూ ఆ ఒక్క మ్యాచ్‌కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టులకు సూర్యను ఎంపిక చేయలేదు. దీంతో బుధవారం నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో వెస్ట్‌జోన్ తరుపున ఆడేందుకు ఈ ఇద్దరు సిద్ధమయ్యారు.
జైస్వాల్, గైక్వాడ్ స్థానంలో పుజారా, సూర్యకుమార్ యాదవ్
విండీస్ టెస్టులకు యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఎంపిక కావడంతో వారి స్థానంలో పుజారా, సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నారు. సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీషా లాంటి ఆటగాళ్ల కూడా ఉన్న ఈ జట్టుకు ప్రియాంక్ పాంచల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీ కోసం ఇప్పటికే పుజారా, సూర్య ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఈ టోర్నీ ముగిసిన తర్వాత పుజారా కౌంటీ క్రికెట్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నాడు. మరోవైపు ఎర్రబంతి క్రికెట్లో తనను నిరూపించుకోవడానికి సూర్యకు ఇది మంచి అవకాశం. ఈ టోర్నీ తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్ కోసం సూర్య వెస్టిండీస్‌కు వెళ్లనున్నాడు.