టీమిండియాను ఓడించడానికి సిద్ధం : విండీస్ కెప్టెన్
టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచుల టెస్టు సిరీస్ కు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డొమికానాలో ప్రారంభం కానుంది. మరోవైపు 2023-25 డబ్ల్యూటీసీ చక్రంలో భారత్‌కు ఇదే తొలి ఆట కావడంతో మళ్లీ విజయాల బాట పట్టాలని టీమిండియా భావిస్తోంది. ఇటీవల వన్డే ప్రపంచ క్వాలిఫయర్ లో వరుస పరాజయాలను అందుకున్న విండీస్ జట్టు టీమిండియాకు ఏ మాత్రం పోటీనివ్వగలదనేది చూడాలి. కొన్నిసార్లు అనుకూలమైన ఫలితాలను పొందడానికి ఆటగాళ్లు కొంచె స్థిరంగా ఉండాలని వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్ పేర్కొన్నాడు.
నిలకడగా ఆడితే విజయం సాధ్యం
తమ జట్టు టీమిండియాతో తలపడేందుకు సిద్ధంగా ఉందని, డొమినికన్ ప్రజల మద్దతు అవసరమని, ఈ సిరీస్‌లో తాము అద్భుతంగా రాణిస్తామని, విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ పేర్కొన్నారు. తాము స్థిరంగా ఆడితే విజయం సాధిస్తామని, మొదటి ఇన్నింగ్స్ నుంచి చివరి వరకూ తాము విజయం కోసమే ప్రయత్నిస్తామని అతను వెల్లడించారు. టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరగనున్న ఈ టెస్ట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. డొమినికాలోని రోసోలోని విండ్సర్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.