అరుదైన రికార్డును సృష్టించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే తొలి జోడీ..!
భారత్ క్రికెట్లోని అత్యుత్తమ బ్యాటర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుర్తింపును పొందారు. ఇప్పటివరకూ వీరు క్రికెట్‌లో అనేక రికార్డులను బద్దలు కొట్టారు. నేడు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో వీరిద్దరూ కలిసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. వన్డేల్లో వేగంగా 5వేలు పరుగులు చేసిన జోడిగా వరల్డ్ రికార్డును క్రియేట్ చేశారు. వెస్టిండీస్ దిగ్గజాలు గోర్డాన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్‌లను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అధిగమించడం విశేషం. కొన్నేళ్లుగా కోహ్లీ,రోహిత్ వన్డే ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నారు. రోహిత్ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించగా, కోహ్లీ ఒంటో చెత్తో భారత జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇక వన్డే ఫార్మాట్లో 5,000 పరుగులు పూర్తి చేసిన ఎనిమిదో జోడీగా వీరిద్దరూ రికార్డెక్కారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
భారత్ తరుపున అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న భారత జోడిగా రోహిత్, కోహ్లీ రికార్డు సృష్టించారు. వీరిద్దరూ కేవలం 86 ఇన్నింగ్స్‌లోనే 5వేల మార్కును అందుకున్నారు. గ్రీనిడ్జ్, హేన్స్ గతంలో ఈ రికార్డును (97 ఇన్నింగ్స్‌లో) అందుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హెడెన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ 104 ఇన్నింగ్స్‌లు ఆ మార్కుకు చేరుకోగా, శ్రీలంకకు చెందిన తిలకరత్నే దిల్షాన్, కుమార సంగక్కర ఈ మార్కు కోసం 105 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. వన్డేల్లో 5,000 పరుగులు చేసిన మూడో భారత జోడీగా కోహ్లీ-రోహిత్ నిలిచారు. గంగూలీ, సచిన్ వన్డే క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్య పరుగులు (8,227) కలిగి ఉన్నారు. ఇక శిఖర్ ధావన్, రోహిత్ వన్డేల్లో 5,193 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.