World Cup 2023 : సచిన్ రికార్డుకి అడుగు దూరంలో రోహిత్ శర్మ
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మూడ్రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 5 నుంచి మొదలయ్యే ఈ టోర్నీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తన అభిమాన బ్యాటర్లు సెంచరీలతో, బౌలర్లు హ్యాట్రిక్స్ తో రాణించాలని ఇప్పటికే అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 12 ఏళ్లగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డుపై కన్నేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు సచిన్ పేరు మీదనే ఉంది. అటు వరల్డ్ కప్ టోర్నీలలో కూడా అత్యధిక సెంచరీలతో సచిన్ అగ్రస్థానంలో నిలిచాడు.
రోహిత్ శర్మకి పోటీగా డేవిడ్ వార్నర్
1992 నుంచి 2011 ప్రపంచ కప్ వరకూ సచిన్ 44 వన్డే ఇన్నింగ్స్‌లను ఆడాడు. ఈ క్రమంలో సచిన్ 2278 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలను బాదాడు. వరల్డ్ కప్ చరిత్రలో ఇదే అత్యధిక సెంచరీల రికార్డు కావడం విశేషం. ఇక వరల్డ్ కప్ టోర్నీలలో రోహిత్ శర్మ 5 సెంచరీలను బాదాడు. ఇంకో సెంచరీ హిట్ మ్యాన్ సాధిస్తే సచిన్ రికార్డును సమం చేస్తాడు. ఇప్పటివరకూ వన్డే వరల్డ్ కప్ ఇన్నింగ్స్ లో రోహిత్ కేవలం 17 ఇన్నింగ్స్‌లను మాత్రమే ఆడాడు. సచిన్ రికార్డును సొంతం చేసుకునేందుకు రోహిత్‌కి పోటీగా డేవిడ్ వార్నర్(4) మాత్రమే ఉన్నాడు.