Sachin Kohli: సచిన్ ... కోహ్లీ స్పెషల్ డే
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్‌లో సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లీ పేర్లు చెప్పగానే రికార్డులు గుర్తుకొస్తాయి. కానీ ఈ ఇద్దరు దిగ్గజాలకు నవంబర్ 15తో ఉన్న అనుబంధం మరింత ప్రత్యేకం. సరిగ్గా ఇదే తేదీన 1989లో 16 ఏళ్ల వయసులో సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన ఆయన తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేశాడు. ఆ చిన్న ఆరంభమే తర్వాత 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంగా మారింది. అంతర్జాతీయ కెరీర్‌లో సచిన్ 34,357 పరుగులు చేసి, 100 సెంచరీలతో ఎవరికీ అందని రికార్డును సొంతం చేసుకున్నాడు.
Details
అదే రోజున సచిన్ చివరి ఇన్నింగ్స్ కూడా
నవంబర్ 15 సచిన్‌కు మరో కారణంతోనూ గుర్తుండిపోయే రోజు. 2013లో వెస్టిండీస్‌తో తన చివరి టెస్టు మ్యాచ్‌లో ఇదే రోజున సచిన్ చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాటింగ్ చేశాడు.
ఆ మ్యాచ్‌లో 74 పరుగులు చేసి అభిమానులను అలరించాడు. ఆశ్చర్యకరంగా తన తొలి టెస్టులో మాదిరిగానే చివరి మ్యాచ్‌లోనూ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవసరం రాలేదు.
వెస్టిండీస్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 182, 187 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో గెలిచింది. సచిన్ ప్రయాణానికి ఆ రోజుతో భావోద్వేగమైన ముగింపు లభించింది.
Details
సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టిన రోజు
ఇదే నవంబర్ 15న మరో చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. 2023 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ముంబై వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌పై విరాట్ కోహ్లీ 50వ వన్డే సెంచరీ సాధించాడు.
దీంతో వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు. అంతేకాదు, వన్డేల్లో 50 శతకాలు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుతం కోహ్లీ వన్డేల్లో 55, టెస్టుల్లో 30, టీ20ల్లో ఒక సెంచరీతో మొత్తం 86 అంతర్జాతీయ శతకాలు సాధించాడు. ఒకరి అరంగేట్రం, మరొకరి రికార్డు.. ఇలా నవంబర్ 15 భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక పేజీగా నిలిచిపోయింది.