Aus vs Ind: భారత్‌తో పింక్‌బాల్ టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టులో ఒక మార్పు
అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా - భారత్ (AUS vs IND) జట్ల మధ్య పింక్ బాల్ టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియా తుది జట్టుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నా, ఆసీస్ మాత్రం తమ ఫైనల్ XIను ప్రకటించింది. కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ జట్టును ప్రకటించినట్లు సమాచారం. తొలి టెస్టు బరిలోకి దిగిన జట్టులో రెండో మ్యాచ్‌కి ఒక మార్పు జరిగినట్లు తెలుస్తోంది. ఆసీస్ బ్యాటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జోష్ హేజిల్‌వుడ్ గాయం పేరుతో మేనేజ్‌మెంట్ ఇప్పటికే పక్కన పెట్టేసింది. అతని స్థానంలో స్కాట్ బోలాండ్‌ను జట్టులోకి తీసుకున్నారు. మిచెల్ మార్ష్‌ను తప్పించి ఇంకెవరినైనా ఛాన్స్ ఇవ్వాలని భావించినా, ఆసీస్ మేనేజ్‌మెంట్ అలాంటి మార్పు చేయలేదు.
మూడో స్థానానికి పడిపోయిన ఆసీస్
ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) ఆసీస్ 0-1 తేడాతో వెనకబడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలబడి, ఆసీస్ మూడో స్థానానికి పడిపోయింది. హేజిల్‌వుడ్ గురించి చెప్పాలంటే, జోష్ హేజిల్‌వుడ్ పక్కటెముకల నొప్పి కారణంగా రెండో టెస్టుతో పాటు సిరీస్‌కు దూరంగా ఉంటాడని ఆసీస్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే, మొదటి టెస్టులో ఆస్ట్రేలియా 295 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
'ఆ విషయం బ్యాటర్లను అడగండి': హేజిల్‌వుడ్
ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్‌లో హేజిల్‌వుడ్ మాట్లాడుతూ, ''రెండో టెస్టులో నేను బాగా ఆడతానా? అని అడిగితే, 'ఆ విషయం బ్యాటర్లను అడగండి' అని సమాధానం ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర చర్చలకు దారితీయడంతో, పలువురు మాజీ క్రికెటర్లు హేజిల్‌వుడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, ఆసీస్ మేనేజ్‌మెంట్ అతడికి గాయం పేరుతో విశ్రాంతి ఇచ్చిందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా అభిప్రాయపడ్డాడు. అయితే, హేజిల్‌వుడ్‌పై వస్తున్న విమర్శలను అతడి మేనేజర్ నీల్ మాక్స్‌వెల్ ఖండించాడు.
ఆసీస్ తుది జట్టు
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనే, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), నాథన్ లైయన్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్