Page Loader
టీమిండియా చీఫ్ సెలక్టర్‌‌గా సెహ్వాగ్.. కానీ!
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా చీఫ్ సెలక్టర్‌‌గా సెహ్వాగ్.. కానీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2023
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా సెలక్షన్ కమిటీ చీఫ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బాధ్యతలు తీసుకుంటున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ చేతనశర్మ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించాడు. అయితే ఓ టీవీ ఛానెల్‌ స్టింగ్ ఆపరేషన్‌లో టీమిండియాకు సంబంధించిన ఓ కీలక సమాచారాన్ని లీక్ చేశాడు. దీంతో అతను ఆ పదవికి రాజీనామా చేశాడు. ప్రస్తుతం ఆ పదవిలో శివసుందర్ దాస్ కొనసాగుతున్నాడు. అతడు ఈస్ట్ జోన్‌కు చెందిన వ్యక్తి, చేతన్ శర్మ నార్త్ జోన్ కావడంతో అక్కడ నుంచి వచ్చిన వ్యక్తికే ఛైర్మన్ పదవి ఇవ్వాలి. నార్త్‌జోన్ నుంచి అందరి కంటే ముందు వరుసలో సెహ్వాగ్ ఉన్నట్లు ప్రముఖ వార్త సంస్థ పీటీఐ వెల్లడించింది.

Details

టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్ కు ఏడాదికి రూ. కోటి

సెహ్వాగ్‌కి టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్‌ పదవి దక్కడం దాదాపు ఖాయమని పీటీపీ పేర్కొంది. అయితే సెలక్షన్ కమిటీ చైర్మన్‌కు బీసీసీఐ ఏడాదికి రూ. కోటి మాత్రమే చెల్లిస్తుంది. సెహ్వాగ్ లాంటి ప్లేయర్ ఇంత తక్కువ ధరకు ఆ పదవి చేపట్టడం అనుమానంగా ఉంది. సెహ్వాగ్ 2015లో రిటైర్ అయిన తర్వాత సెహ్వాగ్ ఎలాంటి పదవిని చేపట్టలేదు. గతంలో వెంగసర్కార్, శ్రీకాంత్ లాంటి పేరున్న ప్లేయర్స్ ఈ పదవిని చేపట్టారు. వెంగ్‌సర్కార్ 2006 నుంచి 2008 వరకూ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో బీసీసీఐ అతనికి ఎలాంటి జీతభత్యాలు ఇవ్వలేదు. ప్రస్తుత తరుణంలో సెహ్వాగ్ లాంటి ప్లేయర్ తక్కువ మొత్తానికి చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకోవడం సందేహమేనని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.