హునుమ విహారి సంచలన నిర్ణయం.. ఆంధ్ర జట్టుకు గుడ్‌బై
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. రాబోయే దేశవాళీ సీజన్ లో ఆంధ్ర జట్టు కాకుండా మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాలని హనుమ విహారి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇన్నాళ్లూ ఆంధ్రా జట్టుకు ఆడిన అతను ఇక నుంచి మధ్యప్రదేశ్ జట్టుకు ఆడనున్నాడు. దీనిపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఈఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో నివేదించింది. విహారి టీమిండియా తరుపున 16 టెస్టుల్లో 839 పరుగులు చేశాడు. అయితే గతేడాది ఇంగ్లండ్ తో జరిగిన చివరి టెస్టు నుంచి అతను భారత జట్టులో చోటు కోల్పోయాడు. ఫామ్ కోల్పోవడంతో సెలెక్టర్లు అప్పట్లో అతనిపై వేటు వేశారు.
ఆంధ్ర జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టు ఈ ఏడాది విహారిని తొలగించిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల విహారి ప్రస్తుతం దులీప్ ట్రోఫీ 2023లో సౌత్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే రజత్ పటిదార్, వెంకటేశ్ అయ్యర్, శుభమ్ వర్మ లాంటి బ్యాటర్లు ఉన్న మధ్యప్రదేశ్ జట్టులో విహారి రాకతో మరింత పటిష్టం కానుంది. ఇప్పటి వరకు 113 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో అతను 8600 పరుగులు చేశారు. ఇందులో 23 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలున్నాయి. హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ నేతృత్వంలో మధ్యప్రదేశ్ 2022 రంజీ ట్రోఫీ టైటిల్ ను గెలుచుకుంది. విహారి ఆంధ్రా జట్టును వదలడంతో ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.