ఆ మెగా టోర్నీకి టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్!
చైనాలోని హాంగ్జౌ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగే ఏషియన్ గేమ్స్ కు భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లను పంపాలని బీసీసీఐ భావిస్తోంది. తొలుత పంపకూడదని భావించినా, తర్వాత నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో ఏషియన్ గేమ్స్ కు పాల్గొనేందుకు టీమిండియా నిరాకరించింది. అయితే ఆ సమయంలో టీమిండియా మెయిన్ టీం వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌లో బిజిగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఏషియన్ గేమ్స్ కు ఇండియా-B జట్టును పంపనున్నారు. అయితే జట్టుకు సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమిస్తారని సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
రింకూ సింగ్, తిలక్ వర్మలకు ఛాన్స్!
ఇక ఐపీఎల్ లో సత్తా చాటిన రింకూసింగ్, తిలక్ వర్మలతో పాటు ఇతర ఆటగాళ్లను ఆ టోర్నీకి ఎంపిక చేయాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. ఈ విషయంపై జులై 7న జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనడంతో పాటు రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లు విదేశీ లీగ్స్ ఆడటంపై కూడా ఓ పాలసీని రూపొందించేందుకు చర్చలు చేయనున్నారు. విదేశీలీగ్స్ ఆడటం కోసం చాలామంది ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు. అయితే భారత్ కు రిటైర్మెంట్ ప్రకటించినా కొంతకాలం వరకు విదేశీ లీగ్స్ ఆడే ఆస్కారం లేకుండా చేయాలనే యోచనలో బీసీసీఐ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.