KL Rahul: 107 బంతుల్లో 66 పరుగులా.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై షోయాబ్ మాలిక్ విమర్శలు
వన్డే ప్రపంచ కప్‌లో వరుసగా పది విజయాలు సాధించిన భారత్, ఫైనల్ మాత్రం నిరాశపరిచింది. చివరి మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి, రన్నరప్‌గా నిలిచింది. ఇప్పటికే టీమిండియా ఓటమిపై చాలా మంది మాజీ క్రికెటర్లు స్పందించారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయాబ్ మాలిక్ (Shoaib Malik) కూడా ఈ అంశంపై మాట్లాడారు. మిడిలార్డర్‌లో స్లో బ్యాటింగ్ కారణంగానే భారత్ ఓడిపోయిందని షోయాబ్ మాలిక్ పేర్కొన్నాడు. ముఖ్యంగా టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ (KL Rahul) చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశారని విమర్శలు చేశాడు. కేఎల్ రాహుల్ తన సొంత శైలిలో క్రికెట్ ఆడివుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
కేఎల్ రాహుల్ వేగంగా ఆడివుంటే ఫలితం వేరేలా ఉండేది
ఒకవేళ కఠినమైన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బౌండరీలు కష్టమైతే స్ట్రైక్ ని రొటైట్ చేయాలని షోయాబ్ మాలిక్ వెల్లడించాడు. అయితే కేఎల్ రాహుల్ అలా చేయకుండా బంతులన్ని వేస్ట్ చేశాడని, 107 బంతుల్లో 66 పరుగులు చేయడం కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ కాదని చెప్పారు. కేఎల్ రాహుల్ వేగంగా ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నారు. ఇక ఆసీస్ బౌలర్లు పరిస్థితులకు తగ్గట్టు ఆడి విశ్వవిజేతగా నిలిచారని కొనియాడారు.