Page Loader
Shreyas Iyer: 'నేను సినిమా చూస్తున్నాను': ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు శ్రేయాస్ అయ్యర్ కు కెప్టెన్ నుంచి ఫోన్ 
'నేను సినిమా చూస్తున్నాను': ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు శ్రేయాస్ అయ్యర్ కు కెప్టెన్ నుంచి ఫోన్

Shreyas Iyer: 'నేను సినిమా చూస్తున్నాను': ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు శ్రేయాస్ అయ్యర్ కు కెప్టెన్ నుంచి ఫోన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 07, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

అనుకోకుండా తుది జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ తన ప్రతిభను చాటుకున్నాడు. భీకరమైన బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై ఆధిపత్యం ప్రదర్శించి, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ మోకాలి గాయంతో తుది జట్టుకు దూరంగా ఉండడంతో శ్రేయస్‌కు ఆడే అవకాశం లభించింది. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు పెవిలియన్‌కు చేరిన నేపథ్యంలో క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. అయితే, మ్యాచ్ ఆడటంపై ఓ ఫన్నీ అనుభవం ఉందని శ్రేయస్ వెల్లడించాడు.

వివరాలు 

మ్యాచ్‌కు ముందు జరిగిన ఆసక్తికర ఘటన 

"మ్యాచ్‌కు ముందురోజు రాత్రి ఓ సినిమా చూస్తూ ఉన్నా. ఆ రాత్రంతా అలానే గడపాలని అనుకున్నా. ఎందుకంటే, నాకు ఛాన్స్ వచ్చే అవకాశమే లేదనుకున్నా. అంతలోనే కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది. విరాట్ కోహ్లీ మోకాలి గాయంతో మ్యాచ్‌కు దూరమవుతున్నాడు, నువ్వు ఆడాల్సి ఉంటుందని చెప్పారు. వెంటనే నా గదికి వెళ్లి నిద్రపోయా. అందుకే, ఈ విజయం, ఈ ఇన్నింగ్స్ నాకు రెండూ గుర్తుండిపోతాయి. విరాట్ గాయపడటం వల్లే అవకాశం వచ్చింది, కానీ నేను మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగానే ఉన్నా. ఎప్పుడైనా అవకాశం వస్తుందని నాకు తెలుసు" అని శ్రేయస్ చెప్పాడు.

వివరాలు 

గత అనుభవం 

"ఇలాంటిదే గత ఆసియా కప్ సమయంలోనూ జరిగింది. నేను గాయపడటంతో నా స్థానంలో మరో ఆటగాడు వచ్చి సెంచరీ చేశాడు. ఆటలో ఇలాంటి సంఘటనలు సహజమే. గత దేశవాళీ సీజన్‌లో పూర్తి సమయం ఆడా.అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నా. ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలో తెలుసుకున్నా. నా ఆటతీరును మార్చుకోకుండా, మరింత మెరుగుపరుచుకున్నా" అని శ్రేయస్ వివరించాడు.