LOADING...
Suryakumar Yadav: ఆసియా కప్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదా?ఎన్‌సీఏకు హార్దిక్ పాండ్యా ..
ఆసియా కప్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదా?ఎన్‌సీఏకు హార్దిక్ పాండ్యా ..

Suryakumar Yadav: ఆసియా కప్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదా?ఎన్‌సీఏకు హార్దిక్ పాండ్యా ..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025కి ఇక మిగిలింది నెలరోజుల సమయమే. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత జట్టు జాబితాను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకోసం బీసీసీఐ ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. రెండు నెలల క్రితం అతనికి హెర్నియా సర్జరీ జరిగింది. ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్న సూర్యను నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) వైద్య బృందం పరీక్షించింది. ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించలేదనే వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా మరో వారం రోజుల పాటు ఎన్‌సీఏలోనే ఉండనున్నాడని సమాచారం. ఫిజియోలు,వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

ఫిట్‌నెస్‌ టెస్టుల కోసం ఎన్‌సీఏలో పాండ్య 

గత వారం ఎన్‌సీఏలో ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో సూర్య షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆసియా కప్‌ జట్టు ఎంపిక దశలో, స్టార్ ఆల్‌రౌండర్‌ హర్థిక్ పాండ్యా కూడా ఫిట్‌నెస్‌ టెస్టుల కోసం ఎన్‌సీఏకు చేరుకున్నాడు. రెండు రోజులపాటు అక్కడే ఉండి అవసరమైన పరీక్షలను పూర్తి చేయనున్నాడు. ఇప్పటికే ఆసియా కప్ కోసం పాండ్య నెట్ ప్రాక్టీస్‌లు కూడా చేస్తున్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్ దృష్ట్యా ఆల్‌రౌండర్‌గా అతనిపై కీలక బాధ్యతలు ఉండనున్నాయి. ఇదే సమయంలో శ్రేయస్ అయ్యర్‌ ఫిట్‌నెస్ టెస్టులు పూర్తి చేసుకుని ఇప్పుడు దేశవాళీ మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నాడు.

వివరాలు 

అక్షర్ స్థానంలో గిల్‌కు అవకాశం? 

సూర్యకుమార్‌ యాదవ్‌ పూర్తిగా ఫిట్ అవుతే ఆసియా కప్‌లో భారత జట్టుకు అతడే కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. అతనికి ఉపసారథిగా శుభమన్‌ గిల్‌ నియమించే అవకాశం ఉందని వార్తలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ బాధ్యత అక్షర్ పటేల్‌ వహిస్తున్నాడు. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లలోనూ గిల్‌కే నాయకత్వం అప్పగించాలనే ఆలోచన మేనేజ్‌మెంట్‌లో ఉందని తెలిసింది. అయితే టీ20 ఫార్మాట్‌లో మాత్రం సూర్యను ఈ పొట్టి కప్‌ వరకే కొనసాగించి, ఆ తర్వాత గిల్‌కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గిల్‌కు వైస్‌ కెప్టెన్‌ పదవి దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.