వెస్టిండీస్ దిగ్గజంతో టీమిండియా ప్లేయర్లు
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం భారత ఆటగాళ్లు కరేబియన్ గడ్డపై అడుగుపెట్టారు. ఈ క్రమంలో భారత బృందం ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు. కెన్నింగ్టన్ ఓవల్‌లో ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లను ఓ స్పెషల్ అతిథి కలిశారు. అతను మరెవరో కాదు విండీస్ మాజీ లెజెండ్ సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ సోబర్స్ ను చూడగానే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అతని దగ్గరికి వెళ్లి కలిశారు. కాసేపు క్రికెట్ గురించి అతనితో వాళ్లు ముచ్చటించారు. అనంతరం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వచ్చి సోబర్స్ ను కలిశాడు. తర్వాత శుభ్‌మన్ గిల్‌ను ద్రావిడ్ పరిచయం చేశారు.
తిరుగులేని ఆల్ రౌండర్ గా పేరు సంపాదించుకున్న సర్‌గార్ ఫీల్డ్ సోబర్స్
అనంతరం ఒక్కొక్కరు వచ్చి సోబర్స్ తో మాట్లాడారు. వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ ఇలా ఆటగాళ్లంతా సోబర్స్ ను కలుసుకొని కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. మొదటి తరం క్రికెటర్లలో గొప్ప ఆల్ రౌండర్‌గా సోబర్స్ పేరు తెచ్చుకున్నారు. 1954 నుంచి 1974 మధ్య కాలంలో రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో తిరుగులేని ఆల్‌రౌండర్‌గా అందరి మన్ననలు అందుకున్నారు. వెస్టిండీస్ తరఫున 93 టెస్ట్ మ్యాచ్‌లాడిన సోబర్స్ 57 సగటుతో 8032 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలున్నాయి.