
Team India: గౌతమ్ గంభీర్ బృందంలోని కీలక సభ్యులపై బీసీసీఐ చర్యలు.. వారి సేవలు ఇక చాలంటూ..
ఈ వార్తాకథనం ఏంటి
జూన్ నెలలో జరిగే ఇంగ్లండ్ పర్యటన కోసం టీమిండియా సిద్ధమవుతుంది.ఈ పర్యటనకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ,బీసీసీఐ కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చేపట్టింది.
ఈ మార్పుల భాగంగా,అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, ఫిట్‌నెస్ కోచ్ సోహమ్ దేశాయ్‌లను వారి పదవుల నుంచి తప్పించినట్లు సమాచారం.
గత బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు 1-3 తేడాతో ఓటమిపాలవడం,అంతకు ముందు న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలోనే దారుణ పరాజయం పాలవడం వంటి పేలవ ప్రదర్శనలు బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి కారణమయ్యాయని తెలుస్తోంది.
అయితే ఈ సవాళ్లను ఎదుర్కొంటూ భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడంలో గంభీర్ నాయకత్వంలోని సహాయక బృందం కీలకపాత్ర పోషించింది అన్నది మరో వాస్తవం.
వివరాలు
అభిషేక్ నాయర్‌ను తప్పించిన బీసీసీఐ?
ఇంగ్లాండ్ పర్యటనకు పెద్ద మోతాదులో కోచింగ్ బృందం అవసరం లేదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే అభిషేక్ నాయర్‌ను జట్టులో కొనసాగించకపోవచ్చన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ఇప్పటికే బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్, బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ పనిచేస్తున్నారు.
అలాగే, టెన్ దుల్కత్ కూడా అసిస్టెంట్ కోచ్‌గా గంభీర్‌కు తోడుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ నాయర్‌ను తప్పించినట్లు సమాచారం.
అయితే టీమ్ ఫీల్డింగ్ మెరుగుదల వెనుక టి దిలీప్ కీలక పాత్ర పోషించారని అనేక మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవికి గుడ్‌బై చెప్పినప్పటికీ, బీసీసీఐ దిలీప్‌పై నమ్మకంతో కొనసాగించింది.
కానీ ప్రస్తుతం దిలీప్‌ను కూడా తప్పించడంతో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
వివరాలు
గంభీర్ ప్రధాన కోచ్‌గా కొనసాగగలరా?
ఇప్పటికైతే ఈ పదవుల ఖాళీలను ఎవరి ద్వారా భర్తీ చేస్తారనే విషయం బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అయితే, ఇంగ్లాండ్ టూర్‌కు ముందే కొత్త కోచింగ్ స్టాఫ్ సిద్ధమవుతుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, బోర్డర్-గావస్కర్ సిరీస్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ లోపలి విషయాలు బయటకు వచ్చిన ఘటనపై ఓ యువ క్రికెటర్ దృష్టిలో నిలవడంతో అతనిపైనే అనుమానాలు ఎక్కువయ్యాయి.
ఇప్పుడు సహాయక కోచింగ్ సిబ్బందిపై తీసుకున్న చర్యలతో జట్టులో అసలు ఏం జరుగుతోంది అనే ఉత్కంఠ అభిమానుల్లో పెరిగింది.
ముఖ్యంగా గంభీర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న అభిషేక్‌పై తీసుకున్న చర్య నేపథ్యంలో భవిష్యత్తులో గంభీర్ ప్రధాన కోచ్‌గా కొనసాగగలరా అనే చర్చ కూడా మొదలైంది.